నరసరావుపేట/పల్నాడు జిల్లా(రైట్స్ మీడియా): పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం పల్నాడు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నరసరావుపేట పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ రకాల ఆధునిక ఆయుధాలు, అడ్వాన్స్డ్ వెపన్స్, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ ఆయుధాలు, హానికరం కాని ఆయుధాలు, గుంపులను చెదరగొట్టేందుకు ఉపయోగించే స్మోక్ గన్స్, డ్రోన్ కెమెరాల పనితీరును విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఆయుధాలను దగ్గరగా పరిశీలించి, కొన్ని పరికరాలను స్వయంగా చేతితో పట్టుకుని ఆసక్తి కనబరిచారు.