హనుమకొం(రైట్స్ మీడియా): కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (KUCET)కు చెందిన 19 మంది ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు (15 మంది బాలికలు, 4 మంది బాలురు) యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA), కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న యువ ఆపద మిత్ర పథకంలో భాగంగా తెలంగాణ విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) – TASP ఆధ్వర్యంలో ఈ ఏడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమం 2026 అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు వరంగల్లోని మామునూరులో ఉన్న 4వ బెటాలియన్ TASP ప్రాంగణంలో నిర్వహించబడింది.
ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు విపత్తుల నిర్వహణ, ప్రథమ చికిత్స, అత్యవసర సహాయక చర్యలు, అగ్నిప్రమాదాల నివారణ, రక్షణ పద్ధతులు, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాలపై సైద్ధాంతిక అవగాహనతో పాటు ఆచరణాత్మక శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆచార్య బి.వెంకట్రామరెడ్డి, డాక్టర్ ఆర్. మేఘనా రావు, KUCET ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. రమణ, NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, NSS ప్రోగ్రామ్ అధికారులు డా. డి. శైలజ, డా. ఎం. సౌజన్యతో పాటు కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది శిక్షణలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.
సమాజ సేవా దృక్పథంతో పాటు విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలిచే నైపుణ్యాలను అలవర్చుకోవడం అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తూ, బాధితులకు తక్షణ సహాయ సహకారాలు అందించేందుకు యువతను సంసిద్ధం చేయడమే యువ ఆపద మిత్ర పథకం ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ శిక్షణ ద్వారా యువతలో విపత్తుల పట్ల అవగాహన, ఆత్మవిశ్వాసం, సేవాభావం, అత్యవసర సమయాల్లో స్పందించే సామర్థ్యం పెంపొందుతాయని తెలిపారు. విపత్తు వేళ సమాజానికి అండగా నిలిచే ఆపద మిత్రులుగా యువతను తీర్చిదిద్దడంలో ఈ శిక్షణ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని కళాశాల యాజమాన్యం అభిప్రాయపడింది.