ఆధునిక ఆయుధాలు, పోలీసు వాహనాలు, ఫోరెన్సిక్ పరికరాలపై అవగాహన..
నరసరావుపేట/పల్నాడు జిల్లా(రైట్స్ మీడియా): పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం పల్నాడు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నరసరావుపేట పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ రకాల ఆధునిక ఆయుధాలు, అడ్వాన్స్డ్ వెపన్స్, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ ఆయుధాలు, హానికరం కాని ఆయుధాలు, గుంపులను చెదరగొట్టేందుకు ఉపయోగించే స్మోక్ గన్స్, డ్రోన్ కెమెరాల పనితీరును విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఆయుధాలను దగ్గరగా పరిశీలించి, కొన్ని పరికరాలను స్వయంగా చేతితో పట్టుకుని ఆసక్తి కనబరిచారు.
బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ పరికరాలు, ట్రాఫిక్ పోలీసుల పరికరాలు, హ్యాండ్హెల్డ్ మెటల్ డిటెక్టర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, రక్షణ హెల్మెట్లు, లాఠీలు, రయట్ గేర్ పరికరాలను ప్రదర్శించారు. వజ్ర వాహనం, మహిళా పోలీస్ స్టేషన్ ప్రత్యేక దర్యాప్తు వాహనం, మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్, రక్షక్ వాహనాలను విద్యార్థులకు పరిచయం చేసి, వాటి వినియోగం, విధుల నిర్వహణలో వాటి ప్రాధాన్యతను వివరించారు.
పోలీసు శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నేర పరిశోధనలో ఫోరెన్సిక్ విభాగం పాత్ర, ట్రాఫిక్ నియంత్రణలో ఉపయోగించే పరికరాలు, వాకీటాకీలు, వీహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ సెట్ల పనితీరు, పోలీసు శాఖలోని వివిధ విభాగాల విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
పోలీసు శాఖ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ పరికరాలు, వాహనాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్, ఏఆర్ డీఎస్పీ గాంధీ రెడ్డి, ఫింగర్ ప్రింట్ యూనిట్ ఇన్స్పెక్టర్ బి. పణి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్. కృష్ణ, గోపీనాథ్, యువరాజు, ఆర్ఎస్సైలు, పోలీసు సిబ్బంది, సుమారు 950 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.