హుస్నాబాద్(రైట్స్ మీడియా): హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం
• ఎల్‌నినోపై ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం.. అనంతరం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి అవసరమైన సహకారం కోరుతాం
• తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలి.. నీటి దుర్వినియోగాన్ని అరికట్టాలి
• ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలి
రైతులు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవద్దు: హుస్నాబాద్‌లో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
అనంతరం హుస్నాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
రైతులు పండించిన ధాన్యం, పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో నేటి నుంచి 136 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కొనుగోళ్ల సమయంలో తూకంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఎంత ధాన్యం వచ్చినా, ఎంత పత్తి వచ్చినా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుత సీజన్లో వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో ధాన్యానికి డిమాండ్ పెరిగిందని మంత్రి తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు నేరుగా కల్లాల వద్దకు వస్తున్నారని, అయితే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తే రైతులు విక్రయించుకోవచ్చని, దళారుల చేతిలో మోసపోవద్దని కోరారు.
సన్న ధాన్యానికి సంబంధించిన బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ముందస్తు అడ్వాన్స్‌లు ఇచ్చే అంశంపై జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు ఎలాంటి మోసాలకు గురికాకుండా చూడాలని తెలిపారు.
రాబోయే సీజన్లో వరి సాగుకు నీరు, విద్యుత్ సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులకు ముందుగానే అవగాహన కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. భవిష్యత్తులో రైతులే స్వచ్ఛందంగా వరి సాగును తగ్గించే పరిస్థితులు రావచ్చని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాలకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి, మంత్రివర్గం వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే తాగునీటి అవసరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, ప్రతి ఒక్కరూ నీటిని అవసరాలకు అనుగుణంగా పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. నీటి దుర్వినియోగాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు.
ఇంకుడు గుంతల నిర్మాణం, బోర్వెల్ రీచార్జ్, చెరువుల పూడికతీత, కాలువల్లో అడ్డంకుల తొలగింపు వంటి పనులను ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్నట్లు తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు, నీటి వనరుల సంరక్షణకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలను ఎలా ఆదుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు. ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, తాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. అనంతరం అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి అవసరమైన సహకారం కోరుతామని వెల్లడించారు.
హుస్నాబాద్‌లోనూ అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని ఆకాంక్షిస్తూ హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 18వ చండీయాగం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.
గ్రామ దేవతల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. మంచి వర్షాలు కురవాలని కొండగట్టు ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణతో పాటు వేములవాడ, కొత్తకొండ, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జునసాగర్‌లో పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 300కు పైగా కరువు మండలాలు ఉన్నాయని, ప్రకృతి వైపరీత్యాలు ముందస్తు సమాచారం లేకుండానే సంభవించే అవకాశం ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
2007లో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతుల త్యాగాలను గుర్తిస్తామని, వారి సహకారంతోనే వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు. గత పదేళ్లలో ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి, ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తోందనే అంశాలపై ప్రజలకు స్పష్టత ఉండాలన్నారు.
తన నియోజకవర్గానికి మొదటి దశలో 3,500, రెండో దశలో 2,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు, చిగురుమామిడి, సుందరగిరి ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి, హుస్నాబాద్- అక్కన్నపేట మార్గంలోని మల్లెచెట్టు చౌరస్తా వద్ద రహదారి అభివృద్ధి కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి, చౌటపల్లి పారిశ్రామిక కారిడార్‌లో భూములు కోల్పోయి అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
హుస్నాబాద్ ప్రాంతంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటు చేశామని, స్విమ్మింగ్ పూల్ కూడా అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాల, 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
సెట్విన్ సంస్థ ద్వారా అందించే శిక్షణను యువత సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు.
రైతుల సంక్షేమం, తాగునీటి భద్రత, వ్యవసాయ రంగ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు సమష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతిరెడ్డి, సుధాకర్, ఆర్డీవో రామ్మూర్తి, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.