Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

పాఠశాల దశ నుండే విద్యార్థులు జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

మోడల్ గ్రామంగా అక్కంపేట: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

పాఠశాల దశ నుండే విద్యార్థులు జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
Share Short Clip Download PDF

• జడ్పీ ఉన్నత పాఠశాల, పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్

• గ్రామంలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధికి రూ. 10 కోట్లతో చేపట్టనున్న ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

ఆత్మకూర్ (రైట్స్ మీడియా): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట ను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు.

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్వగ్రామ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 10 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో ప్రతిపాదిత అభివృద్ధి పనులను స్థానిక సర్పంచ్ సాంబయ్య, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ గ్రామంలోని ఎస్సీ కాలనీ, యాదవ కాలనీ, తదితర కాలనీలలో పర్యటించారు.

గ్రామంలో ప్రతిపాదిత సిసి రోడ్లు, డ్రైనేజీలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించగా గ్రామ సర్పంచ్ సాంబయ్య, తదితరులు జిల్లా కలెక్టర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

గ్రామంలోని కోదండ రామాలయం, రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వీబీజీ రాంజీ ద్వారా నిర్మిస్తున్న కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్ పనులను జిల్లా కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ..

ప్రొఫెసర్ జయశంకర్ సార్ గ్రామాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టే ప్రతిపాదిత అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్ లను త్వరగా అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ..

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా నిర్వహించాలన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను సందర్శించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆరా తీశారు. పాఠశాలలో మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారా లేదా అని ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పిఎంశ్రీ ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారని ఆరా తీశారు. విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. తాగునీటి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల దశ నుండే విద్యార్థులు జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ..

పాఠశాల దశ నుండే విద్యార్థులు జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుండే జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా కెరీర్‌ను ఎంచుకోవాలని తెలిపారు. పాఠశాల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడి, మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల విజయాల గ్రాఫ్ పెరగడంతో పాటు అక్కంపేట గ్రామానికి ఉన్న చరిత్రను విద్యార్థులు నిలబెట్టాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రాంగణంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి అన్ని రకాల కూరగాయలను పండించాలని సూచించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ విజయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి యాదగిరి, పంచాయతీ రాజ్ ఏఈ బాబురావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రంజిత్ కుమార్, ఏఈఈ సుదర్శన్, ఏపీవో రాజిరెడ్డి, ఇతర శాఖల అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.