వరంగల్(రైట్స్ మీడియా): డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని తమ విలువైన భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, సూచించారు.
అక్టోబర్ నెలను జాతీయ సైబర్ సెక్యూరిటీ అవగాహన నెల (National Cybersecurity Awareness Month – NCSAM)గా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమారంలోని SVS కళాశాల ఆడిటోరియంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
యువత ఆన్లైన్ మోసాల బారిన పడొద్దు: సీపీ ఎన్.శ్వేత
• భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, మన సంస్కృతి మరియు విలువలను కాపాడుకుందాం.
• మంచి చెడుల మధ్య తేడాను గుర్తిస్తూ, బాధ్యతాయుతంగా ముందుకు సాగుదాం.
• కుటుంబ సభ్యులందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించండి.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,
భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోయే వ్యక్తులు మీరేనని, ప్రస్తుతం మీరు ఉన్న వయస్సు జీవితానికి అత్యంత కీలకమైన దశ అని పేర్కొన్నారు. ఈ దశలోనే ప్రతి ఒక్కరూ అవసరమైన అవగాహనను పెంపొందించుకోవాలని, పాటించే విలువలు, అలవాట్లు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి దోహదపడతాయని తెలిపారు.
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదని సూచించారు. కొందరు సైబర్ నేరగాళ్లు భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బాధితులను బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా, సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రానున్న దసరా సెలవులను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ భద్రతా నియమాలను పాటిస్తూ సైబర్ నేరాల నివారణలో భాగస్వాములు కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, కేయూసీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ అశోక్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ శివకుమార్, SVS కళాశాల అధ్యాపకులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.