వరంగల్ నుంచి మొదలయ్యే ప్రజా ఉద్యమాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయనే భయంతోనే ఈ ప్రాంత రాజకీయ ఐక్యతను దెబ్బతీసేలా జిల్లాల విభజనకు పాల్పడ్డారనే విమర్శను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా ముందుకు తెచ్చారు. సిద్ధిపేటకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో వరంగల్ అభివృద్ధిని విస్మరించారని, ఈ ప్రాంతానికి రావాల్సిన ప్రాధాన్యతను, అవకాశాలను దూరం చేశారని ఆరోపించారు. జిల్లా విభజనతో పరిపాలనా వ్యవస్థలో ఏర్పడిన అసంబద్ధతలు, చారిత్రక గుర్తింపుకు జరిగిన నష్టం ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు.
వరంగల్ జిల్లా విభజన జరిగి పదేళ్లు పూర్తయిన ఈ రోజును జిల్లా ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన రోజుగా అభివర్ణించారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు వరంగల్‌కు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జిల్లాల విభజనను గొప్ప విజయంగా చిత్రీకరించుకోవడం కాదని, ఆ నిర్ణయం వల్ల వరంగల్ ప్రాంతానికి జరిగిన నష్టంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తోందని నాయిని పేర్కొన్నారు. మరోవైపు, గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు ఎదురైనప్పుడు వాటికి సమాధానం చెప్పకుండా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా దుష్ప్రచారానికి పాల్పడటం రాజకీయ బాధ్యతారాహిత్యమని విమర్శించారు. వరంగల్ ప్రజల ప్రయోజనాల కంటే స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిన నాయకులను జిల్లా ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
వరంగల్ చరిత్రను, ఆత్మగౌరవాన్ని, యువత భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాలకు బలి చేసిన నిర్ణయాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వరంగల్‌కు జరిగిన అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ఈ ప్రాంత హక్కులు, అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగించడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావిస్తోందని తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కుడా చైర్మన్ గుండు సుధారాణి, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, జిల్లా కమిటీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.