అమరావతి, నవంబర్ 3(రైట్స్ మీడియా): కూటమి ప్రభుత్వం అందిస్తోన్న సుపరిపాలనకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా మద్దతు తెలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై ఈ మేరకు మీడియా సమావేశంలో స్పందించారు. అనునిత్యం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించే ప్రజలు కూటమికి అండగా నిలిచారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందనే నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉందని అందుకే పట్టణ ప్రాంత స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించిందని చెప్పారు.

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయాలా? ప్రజా సమస్యల పరిష్కారమా? అని నిర్ణయించుకోవాల్సి వస్తే తాను సమస్యల పరిష్కారనికే ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజలకు సేవలందించే క్రమంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని గుర్తించి సరిదిద్దుకుంటున్నామని, ప్రజలు మెచ్చే పాలన అందించడంతో పాటు వారి ఇబ్బందులను తొలగించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేశామని చంద్రబాబు తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్నామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించామని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. గత పాలకులు రోడ్లను ధ్వంసం చేస్తే.. తమ ప్రభుత్వం తిరిగి రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తోందని వివరించారు. రాష్ట్రంలో అన్ని సమస్యలూ పరిష్కారమైపోయాయని తాము చెప్పడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన అనేక సమస్యలు ఇంకా ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. రాజకీయ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రభుత్వం ప్రజలందరికీ సేవలు అందిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. ఇదే తన విధానమని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే.. ప్రజలే తమకు అండగా నిలుస్తారనేది తన నమ్మకం అన్నారు. ఇదే విధంగా కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.