అమరావతి, నవంబర్ 03(రైట్స్ మీడియా): వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు తుఫాన్లలో ప్రాణనష్టాన్ని నివారిస్తూ, ఆస్తినష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. వరుస తుఫాన్లపై ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యలను మీడియాకు వివరించారు.
తుఫాన్ల సహయక చర్యల్లో టీమ్ స్పిరిట్‌తో పనిచేశాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 4–5 రోజుల్లోనే గాడిన పెట్టాం
⏩ తుఫాన్లు...కరవుపై ఒకేసారి కేంద్ర బృందాలు ఏపీలో పర్యటిస్తున్నాయి
⏩ ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలపై అధ్యయనం
తుఫాన్లలో ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేశాం: అర్నబ్, మురసు తుఫాన్ల సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...
తుఫాన్ల సమయంలో ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది రాత్రిపగలు అలుపు లేకుండా పనిచేశారని ప్రశంసించారు. ముఖ్యంగా ప్రభావిత జిల్లాల కలెక్టర్లు టీమ్ లీడర్లుగా వ్యవహరించి సహాయక చర్యలను సమర్థంగా సమన్వయం చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి మొదలుకుని స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ టీమ్ స్పిరిట్‌తో పనిచేశారని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతోనే సహాయక చర్యలను సమర్థంగా నిర్వహించగలిగామని సీఎం చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడటం, ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను త్వరగా పునరుద్ధరించడమే లక్ష్యంగా అందరం సమష్టిగా కృషి చేశామని తెలిపారు. విపత్తు సమయంలో ప్రజల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. విపత్తు నిర్వహణలో రక్షణ, సహాయక చర్యలు, పునరావాసం అనే మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. తుఫాన్ల గమనాన్ని, గాలుల వేగాన్ని, వర్షపాత అంచనాలను నిరంతరం విశ్లేషిస్తూ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించామని వెల్లడించారు. ఆర్టీజీఎస్ ద్వారా క్షేత్రస్థాయి యంత్రాంగానికి ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని చేరవేశామని, అవేర్ వ్యవస్థ ద్వారా అందిన డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. గాలుల వేగం, వర్షపాతం, వరద నిర్వహణ, నీటి మళ్లింపు తదితర అంశాలపై చేసిన అంచనాలు క్షేత్రస్థాయి వాస్తవాలతో పోల్చినప్పుడు 90 శాతం వరకు సరైనవిగా తేలాయని పేర్కొన్నారు. ముంపు గ్రామాలు, తుఫాను ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన సహాయక సిబ్బంది, పరికరాలను అక్కడ మోహరించడంతో సహాయక చర్యలను వేగంగా చేపట్టగలిగామని సీఎం చంద్రబాబు తెలిపారు.
⏩20 రోజులు పట్టే పనిని 4–5 రోజుల్లోనే పూర్తి చేశాం:
తుఫాన్ల కారణంగా వివిధ జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి కేవలం 4–5 రోజుల్లోనే సరఫరాను చాలావరకు పునరుద్ధరించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సుమారు 31 వేల విద్యుత్ స్తంభాలు కూలిపోగా, 4,095 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, 548 సబ్స్టేషన్ల పరిధిలో సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. ఇంత భారీగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టేందుకు సాధారణంగా కనీసం 20 రోజుల సమయం పట్టేదని, అయితే పక్కా ప్రణాళిక, సమన్వయం, సిబ్బంది అంకితభావంతో నాలుగైదు రోజుల్లోనే పునరుద్ధరణ సాధ్యమైందని సీఎం చంద్రబాబు వివరించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ నిరంతరం పనిచేశారని చెప్పారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా చెట్లను తొలగిస్తూ, కూలిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారని, స్తంభాలు పాతేందుకు పెద్ద సంఖ్యలో డ్రిల్లింగ్ యంత్రాలను వినియోగించామని తెలిపారు. ఆక్వా చెరువుల్లోనూ విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, వేలాది చెట్లు నేలకొరిగినా సిబ్బంది వర్షంలోనే వాటిని తొలగించి పునరుద్ధరణ పనులు కొనసాగించారని పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేసి సరఫరాను త్వరగా పునరుద్ధరించారని ముఖ్యమంత్రి అభినందించారు.
⏩5 వేల మంది గర్భిణుల తరలింపు... 1029 కాన్పులు:
తుఫాన్ల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన సుమారు 5 వేల మంది గర్భిణులను ముందుగానే గుర్తించి ఆస్పత్రులకు తరలించామని వెల్లడించారు. ఈ వారం రోజుల్లోనే 1,029 మంది గర్భిణులకు ప్రసవాలు జరిగాయని వివరించారు. గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్య భద్రతకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించామని చెప్పారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్సులు, అత్యవసర మందులు, పాము కాటు నివారణకు అవసరమైన యాంటీ స్నేక్ వెనమ్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టామని, అంటువ్యాధులు ప్రబల కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. 17 జిల్లాల్లోని 19,265 రేషన్ దుకాణాల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
⏩పొరుగు రాష్ట్రాలు, కేంద్రం సహకారం తీసుకున్నాం:
విద్యుత్ పునరుద్ధరణతో పాటు ఇతర సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో ఒడిశాలో తుఫాను సహాయక చర్యల కోసం మన రాష్ట్రం నుంచి సిబ్బందిని పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులతో, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి అదనపు సిబ్బందిని పంపాలని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి ఎప్పటికప్పుడు వివరించామని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ మాట్లాడగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర బృందాలు రాష్ట్రానికి వచ్చి నష్టాన్ని అంచనా వేశాయని, అర్నబ్ తుఫాను నష్టంపై రూ.4,526 కోట్లతో మధ్యంతర నివేదికను కేంద్రానికి పంపినట్లు చెప్పారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను అందజేస్తామని వెల్లడించారు. అర్నబ్ తుఫాను కారణంగా 3.52 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. మురసు తుఫాను నష్టంపై కూడా ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
⏩11 టీఎంసీల నీరు రిజర్వాయర్లకు... 25 టీఎంసీలు చెరువుల్లోకి..
ఒకవైపు తుఫాన్లు, మరోవైపు ఎల్‌నినో ప్రభావం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. తుఫాన్ల ద్వారా వచ్చిన నీటిని వృథా కాకుండా భద్రపరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, వచ్చిన నీటిని అవసరమైన ప్రాంతాలకు మళ్లించామని చెప్పారు. ఈ రెండు తుఫాన్ల ద్వారా వచ్చిన నీటిలో 11 టీఎంసీలను రిజర్వాయర్లకు మళ్లించగలిగామని, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో మరో 25 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రెండుసార్లు తుఫాన్లు వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఇంకా 28 శాతం లోటు వర్షపాతం ఉందని, ముఖ్యంగా రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. తీరప్రాంతం తుఫాన్లతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, రాయలసీమ కరవుతో సతమతం అవుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపాలంటే పోలవరం సహా ప్రాధాన్యమున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏవీఎస్ రెడ్డితో మాన్యువల్ రూపొందించామని, హుద్‌హుద్ తుఫాను సమయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టక్కర్‌తో విపత్తు నిర్వహణ మాన్యువల్ తయారు చేయించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తుఫాన్లపై ఓ మాన్యువల్ ను రూపోందించి అమలు చేస్తామని తెలిపారు. ఇప్పుడు అర్నబ్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తుండగా, ఎల్‌నినో పరిస్థితులను అంచనా వేసేందుకు మరో బృందం క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరుపుతోందన్నారు. ఈ బృందాలు పర్యటిస్తున్న సమయంలోనే మురసు తుఫాను ముప్పు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు. ఒక రాష్ట్రం ఒకేసారి ఇన్ని విపత్తులను ఎదుర్కోవడం ఇదే తొలిసారని, తాను కూడా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
⏩అధ్యయనం... ప్రత్యామ్నాయం... శాశ్వత పరిష్కారం:
తుఫాన్ల సమయంలో ఎదురైన అనుభవాలను సమగ్రంగా విశ్లేషించి భవిష్యత్తులో నష్టాలను తగ్గించే శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈదురుగాలులను తట్టుకునేలా విద్యుత్ స్తంభాల నిర్మాణంలో మార్పులు చేయాలా? లేక ప్రత్యామ్నాయ సాంకేతిక పరిష్కారాలను అనుసరించాలా? అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. తుఫాన్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల సాగు సీజన్లో మార్పులు చేయాలా? ప్రకృతి విపత్తులను తట్టుకోగలిగే ప్రత్యామ్నాయ వంగడాలను ప్రోత్సహించాలా? అన్న అంశాలను వ్యవసాయ నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. ఈసారి రైతులందరికీ పంటల బీమా చేయించామని, బీమాతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందుబాటులోకి వస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. తుఫాన్లు సహా ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులు నష్టపోకుండా ఉండేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.