మంగళగిరి, అక్టోబరు 21(రైట్స్ మీడియా): శాంతిభద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసు శాఖ దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. నేరస్తులకు పోలీసు యూనిఫాం చూస్తే భయం కలగాలని, బాధితులకు భరోసా ఏర్పడాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగించే పరిస్థితులు కల్పించాలని పోలీస్ శాఖకు సూచించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో బుధవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
ఖాకీ అంటే బాధ్యత.. పోలీసు అంటే భరోసా అని సీఎం పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీసులే ధైర్యం, స్థైర్యమని అన్నారు. ప్రమాదం జరిగినా, నేరం జరిగినా ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులేనని చెప్పారు. ప్రజల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు పోలీసులు తమ కుటుంబాల పండుగలకు దూరమవుతున్నారని అన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్, వీఐపీల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దసరా ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా ప్రజలు నిర్వహించు కోవటంలో పోలీసుల నిరంతర శ్రమ అభినందనీయమని అన్నారు. 1959 అక్టోబరు 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ పదిమంది పోలీసులు వీరమరణం పొందారని, వారి త్యాగానికి గుర్తుగా ఏటా ఈ రోజును పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను స్మరించుకోవడం కేవలం సానుభూతి కాదని, సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.