హైదరాబాద్ (రైట్స్ మీడియా): మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను TWU, SWO, INTUC కూటమి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించాలని యూనియన్ నేతలు మంత్రిని కోరారు.
అదేవిధంగా రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించడంతో పాటు, రిటైర్డ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
యూనియన్ నేతల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, వారికి గతంలో రావాల్సి ఉన్న పెండింగ్ బకాయిలను చెల్లించే అంశంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో TWU, SWO, INTUC కూటమి నేతలు అశ్వద్ధామ రెడ్డి, రాజిరెడ్డి, వి.ఎస్. రావు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.