Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

నిస్సహాయతతో కలెక్టరేట్‌ గడప తొక్కే పేదల కన్నీరు తుడవాలి: సీఎం ఎ. రేవంత్‌రెడ్డి

⏩రూ.51 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం.

నిస్సహాయతతో కలెక్టరేట్‌ గడప తొక్కే పేదల కన్నీరు తుడవాలి: సీఎం ఎ. రేవంత్‌రెడ్డి
Share Short Clip Download PDF

⏩రూ.1096.22 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. రూ.28.70 కోట్లతో నిర్మించిన వివిధ అభివృద్ధి భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి.

⏩కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిస్థాయి సమీక్ష కోసం మరోసారి వస్తా: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి

కరీంనగర్(రైట్స్ మీడియా): సమస్యతో, బాధతో, నిస్సహాయ స్థితిలో కలెక్టరేట్‌ గడప తొక్కే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉందనే నమ్మకం కలిగించేలా సమీకృత జిల్లా కలెక్టరేట్‌ పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను కుటుంబ సభ్యుల సమస్యలుగా భావించి పరిష్కరించాలని వారి కన్నీరు తుడవాలని పేర్కొన్నారు. ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించే విధంగా పనిచేయాలన్నారు.

బుధవారం కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి బృందానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఘన స్వాగతం పలికారు

కరీంనగర్‌లో రూ.51 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

రూ.29.62 కోట్లతో జిల్లాలో చేపడుతున్న మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణ పనులకు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.840 కోట్లతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు, కే.ఎస్.సీ.సీ.ఎల్. స్పెషల్ గ్రాంట్స్ కింద రూ.21.60 కోట్లతో చేపట్టిన వరదనీటి మురుగు కాల్వల నిర్మాణ పనులకు, రూ.25 కోట్లతో చేపట్టనున్న మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ బిల్డింగ్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.5.70 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ భవనాన్ని, రూ.6.50 కోట్లతో నిర్మించిన కాశ్మీర్ గడ్డ సమీకృత వెజ్–నాన్ వెజ్ మార్కెట్‌ను, రూ.16.50 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డిఆర్ఎఫ్ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. వేద మంత్రాల, సర్వమత ప్రార్థనల మధ్య జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఇన్‌చార్జి మంత్రి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టేట్ చాంబర్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రత్యేకంగా ఆహ్వానితులైన జిల్లా ప్రముఖులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,

సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పేద ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేలా పనిచేయాలని అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం సంపూర్ణంగా ఉపయోగపడాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు అత్యంత నిరుపేద వర్గాల వరకు చేరే విధంగా ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా పేదలకు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

బాధతో, సమస్యలతో కలెక్టరేట్ కార్యాలయానికి సహాయం కోసం వచ్చే వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించాలని సీఎం సూచించారు. తమ కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందిస్తామో, అదే విధంగా ఇతరుల పట్ల మన ప్రవర్తన ఉండాలని అన్నారు.
మనకు అవసరమైన పని జరగకపోతే కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడతారో ఒకసారి ఆలోచించుకుంటే కార్యాలయానికి వచ్చే వారికి పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,

ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం

ప్రజా పాలన ప్రారంభమయ్యే సమయానికి ఉద్యోగులకు జీతభత్యాలు ఒకటో తేదీన ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. జీతభత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదోన్నతులు, బదిలీలు, ఆరోగ్య భద్రత కార్డులు వంటి ఉద్యోగుల సమస్యలను ఉద్యోగుల సహకారంతో పరిష్కరిస్తున్నామని అన్నారు. సమస్యలు మొత్తం పరిష్కారం కాకపోయినా ప్రజలకు సేవలు అందిస్తూనే తమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని ఉద్యోగులకు సూచించారు.

రాష్ట్రంలో పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ తదితర మార్గాల ద్వారా ఉద్యోగాలు చేస్తున్న వారు దాదాపు పదిన్నర లక్షల మంది ఉన్నారని, వారు నాలుగు కోట్ల ప్రజలకు సేవలు అందిస్తున్నారని సీఎం తెలిపారు. సుమారు మూడు శాతం మంది ఉద్యోగులు 97 శాతం ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ఇది ఎంతో నిష్ఠ, శ్రమతో కూడుకున్న బాధ్యత అని అన్నారు.

ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం

ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా.. చెడ్డ పేరు రావాలన్నా ఉద్యోగులే కీలకం

రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా దేశ ప్రధానమంత్రికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా అందులో ఉద్యోగుల పనితీరు కీలకమని సీఎం అన్నారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రి బాగా పనిచేస్తున్నారని ప్రజలు అంటారని, ఉద్యోగుల పనితీరు సక్రమంగా లేకపోతే ప్రభుత్వాల వల్ల లాభం లేదని ప్రజలు అంటారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఎన్ని శాసనాలు, చట్టాలు చేసినా, నిధులు, అనుమతులు ఇచ్చినా వాటిని ప్రజలకు చేరవేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.840 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ నగర అభివృద్ధికి చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే అభినందించేందుకు తనకు ఎలాంటి సంకోచాలు లేవని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, మిగిలిన సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి అవసరమైన పనులు సాధించుకోవాలని చూస్తామని సీఎం తెలిపారు.

ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా.. చెడ్డ పేరు రావాలన్నా ఉద్యోగులే కీలకం

గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం కేంద్రంతో సంప్రదింపులు

గౌరవెల్లి రిజర్వాయర్ 98 శాతం పూర్తయిందని, సుప్రీంకోర్టులో కేసు కారణంగా మిగిలిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. వందల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ వాటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోతే చేసిన పని మొత్తం నిష్పలమవుతుందని అన్నారు.

తన ఢిల్లీ పర్యటనలను కొంతమంది అపహాస్యం చేస్తూ 78 సార్లు ఢిల్లీ వెళ్లారని విమర్శిస్తున్నారని సీఎం తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్లాల్సిందేనని అన్నారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం మారం జగదీష్ ఎన్నోసార్లు నాయకుల చుట్టూ తిరుగుతున్నారని, రెండు రోజులు ఆలస్యం అయితే సామాజిక మాధ్యమాల్లో ఆయనను విమర్శిస్తున్నారని తెలిపారు. పనిచేసేవారినే విమర్శిస్తారని, తక్షణమే అనుకున్న పనులన్నీ పూర్తి కావని, అయితే తమ ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండకూడదని అన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం కేంద్రంతో సంప్రదింపులు

కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి 170 ఎకరాల డిఫెన్స్ భూమి మంజూరు

హైదరాబాద్ ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతాలైన కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాలకు రావాలంటే కంటోన్మెంట్ ప్రాంతం బాటిల్‌నెక్‌గా ఉందని సీఎం తెలిపారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు, అప్పటి ప్రధాని వాజ్‌పేయి, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించినప్పటికీ పరిష్కారం కాలేదని అన్నారు.

2023 డిసెంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరు నెలల కాలంలో కంటోన్మెంట్ ప్రాంతంలో 170 ఎకరాల డిఫెన్స్ భూమిని రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అప్పగించిందని తెలిపారు. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద రన్‌వే కారణంగా రహదారి నిర్మాణానికి ఇబ్బందులు ఉన్న ప్రాంతంలో టన్నెల్ రోడ్డు నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చారని తెలిపారు. దేశంలో ఇలాంటి అనుమతులు మరే రాష్ట్రానికి ఇవ్వలేదని అన్నారు.

ఒక సంవత్సరం కాలంలో ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తాయని, వీటిని రూ.5,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని సీఎం తెలిపారు.
రాష్ట్రానికి అవసరమైన పనులకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం మన బాధ్యత అని అన్నారు.

ప్రజల అభివృద్ధి కోసం సిద్ధాంతపరమైన వైరుధ్యాలను పక్కనపెట్టి కలిసి పనిచేస్తాం

విద్యార్థి దశ నుంచి దేశ రాజకీయాల వరకు తనకు అవకాశం రావడం ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. కరీంనగర్ నగర అభివృద్ధికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

అభివృద్ధి పనులు, సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు తదితర అనేక అంశాలపై కరీంనగర్ జిల్లాలో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించేందుకు మరోసారి వస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సన్మానించి మెమెంటోలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద, కరీంనగర్‌ మేయర్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ఓ స్వామి, వివిధ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రజల అభివృద్ధి కోసం సిద్ధాంతపరమైన వైరుధ్యాలను పక్కనపెట్టి కలిసి పనిచేస్తాం