Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

మత్తు పదార్థాలకు దూరం.. లక్ష్య సాధనే ధ్యేయం కావాలి: ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

⏩ఆధునిక సాంకేతికతను సమాజ హితానికి వినియోగించాలి: యువతకు మార్గనిర్దేశం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

మత్తు పదార్థాలకు దూరం.. లక్ష్య సాధనే ధ్యేయం కావాలి: ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు
Share Short Clip Download PDF

⏩ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఘనంగా 'Gen-Z స్టూడెంట్స్ ఇంట్రాక్ట్'

నరసరావుపేట(రైట్స్ మీడియా): నేటి ఆధునిక యుగంలో నవతరం (Gen-Z) విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలతో ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. స్థానిక ఎస్ఎస్ఎన్ డిగ్రీ & పీజీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన "Gen-Z స్టూడెంట్స్ ఇంట్రాక్ట్" సదస్సు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉన్నతికి, వ్యక్తిత్వ వికాసానికి ఉద్దేశించిన సూత్రాల అవగాహన బోర్డుపై ఎమ్మెల్యే స్వయంగా సంతకం చేసి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం కళాశాల విద్యార్థులతో ఆయన నేరుగా ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ

డిజిటల్ యుగంలో జెన్-జీ తరం ఆలోచనలు, విశ్లేషణ ఎంతో వినూత్నంగా ఉన్నాయని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం వినోదానికే పరిమితం చేయకుండా విజ్ఞాన సముపార్జనకు, స్టార్టప్‌లు, సరికొత్త ఆవిష్కరణల రూపకల్పనకు వేదికగా మార్చుకోవాలన్నారు. దేశ ప్రగతి యువత చేతుల్లోనే ఉందని, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యత, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ కెరీర్‌లో, నిత్య జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సిన కీలక అంశాలపై ఆయన సమగ్ర అవగాహన కల్పించారు.
కేవలం డిగ్రీ పట్టాకే పరిమితం కాకుండా కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, ఇంగ్లీష్, డిజిటల్ స్కిల్స్ వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్చుకోవాలని కోరారు. ఉద్యోగం కోసం వెతికే స్థాయి నుంచి స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాల ద్వారా నలుగురికి ఉద్యోగం సృష్టించే ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఏఐ మన ఉద్యోగాలను తీసుకుంటుందన్న భయం వీడి, ఏఐ ని సరైన రీతిలో వినియోగించుకునే నైపుణ్యాన్ని సాధించాలన్నారు. అలాగే సోషల్ మీడియాలోని ప్రతీ సమాచారం నిజం కాదని, ఏదైనా పోస్ట్ షేర్ చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని (Fact-check) స్పష్టం చేశారు.
రోజులో కొంత సమయాన్ని చదువు, నైపుణ్యాల సాధన, వ్యాయామం, కుటుంబానికి కేటాయిస్తూ సమయాన్ని విలువైనదిగా భావించాలన్నారు. పౌష్టికాహారం, నిత్య వ్యాయామం, సరైన నిద్రతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ముఖ్యంగా యువత ఏ పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల బారిన పడకూడదని, తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం యావత్ జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. సంపాదన, పొదుపు, పెట్టుబడులపై అవగాహన పెంచుకుంటూ అనవసరపు అప్పులకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఓటు హక్కు వచ్చిన తర్వాత పూర్తి సమాచారంతో కూడిన సరైన నిర్ణయం తీసుకుంటూ ప్రజాస్వామ్య ప్రక్రియలో బాధ్యతాయుతంగా పాల్గొనాలని చెప్పారు. జీవితంలో ఒక పరీక్షలోనో, ఉద్యోగంలోనో, వ్యాపార ప్రయత్నంలోనో ఎదురయ్యే వైఫల్యం జీవితానికి ముగింపు కాదని, వైఫల్యాలను పాఠాలుగా మలచుకుని సరికొత్త పట్టుదలతో ముందుకు సాగాలని ధైర్యం చెప్పారు.

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ యువతకు స్ఫూర్తిదాయక సందేశమిస్తూ "మీ తరం భవిష్యత్తు కోసం ఎదురు చూసే తరం కాదు భవిష్యత్తును నిర్మించే తరం. చదువు, నైపుణ్యం, క్రమశిక్షణ, ఆరోగ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ఈ ఐదు విషయాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. సోషల్ మీడియాలో కనిపించే తాత్కాలిక ప్రశంసలను కాకుండా, నిజ జీవితంలో సాధించే శాశ్వత విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మన నియోజకవర్గానికి, దేశానికి ఉపయోగపడే ఉన్నత స్థాయికి ఎదగండి. మీ భవిష్యత్తే మన నియోజకవర్గం భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు" అని ఉద్ఘాటించారు. ఈ ముఖాముఖిలో ప్రస్తుత విద్యా విధానం, ఉద్యోగావకాశాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఎమ్మెల్యే ఎంతో ఓపికగా, ఆత్మీయంగా సమాధానాలిస్తూ వారిలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

ఈ కార్యక్రమంలో కపలవాయి విజయకుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, కళాశాల యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో డిగ్రీ, పీజీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ

Source / reference: Journalist Sk. Gouse, Palnadu.