హనుమకొండ(రైట్స్ మీడియా): వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, డాక్టర్ కడియం కావ్యకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (2026–27)లో సభ్యురాలిగా మరోసారి అవకాశం లభించింది. 2026 సెప్టెంబర్ 26 నుంచి ఈ కమిటీలో ఎంపీ డా.కడియం కావ్య సభ్యురాలిగా నామినేట్ అయినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికంగా తెలియజేసింది.
ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ (హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్) భూపేంద్ర భాస్కర్ అక్టోబర్ 3న ఎంపీ డాక్టర్ కడియం కావ్య కి అధికారిక లేఖ పంపారు.
ఇప్పటికే ప్రజారోగ్యానికి సంబంధించిన పలు అంశాలను డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్లో ప్రస్తావించారు. ముఖ్యంగా పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని 2026 మార్చి 27న లోక్‌సభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పారాక్వాట్ వినియోగం వల్ల కలుగుతున్న ఆరోగ్య ప్రమాదాలను ప్రస్తావిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు చేశారు. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం గడ్డి మందును పూర్తిగా నిషేధించింది.
అదేవిధంగా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వైద్య విధానాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై కూడా డాక్టర్ కడియం కావ్య ప్రత్యేకంగా దృష్టి సారించారు.
క్యాన్సర్ చికిత్స కంటే ముందుగా క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయని, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో కూడా నాణ్యమైన క్యాన్సర్ స్క్రీనింగ్ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రజలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సులభంగా స్క్రీనింగ్ అందేలా జాతీయ స్థాయిలో మరింత బలమైన వ్యవస్థ అవసరమని ఎంపీ కోరుతున్నారు.