Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఏఐ ఆధారిత సిలబస్‌తో కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూల మార్పులు

⏩ఉత్తర తెలంగాణ విద్యాసంస్థలకు నోడల్ కేంద్రంగా అభివృద్ధి

ఏఐ ఆధారిత సిలబస్‌తో కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూల మార్పులు
Share Short Clip Download PDF

⏩అంతర్జాతీయీకరణ, పరిశోధన, పరిశ్రమల అనుసంధానానికి ప్రాధాన్యం: వీసీ ప్రొ. కె. ప్రతాప్ రెడ్డి

హనుమకొండ (రైట్స్ మీడియా): కాకతీయ విశ్వవిద్యాలయంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత సిలబస్‌ను ప్రవేశపెట్టడంతో పాటు, విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో సమూల మార్పులు చేపడుతున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొ. కె. ప్రతాప్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) ఆధ్వర్యంలో జేఎన్‌టీయూహెచ్ గోల్డెన్ జూబ్లీ హాల్‌లో శనివారం నిర్వహించిన రీచ్–2026 సదస్సులో జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఉత్తర తెలంగాణ విద్యాసంస్థలకు నోడల్ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తొలిదశలో సుమారు 2,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించి, భవిష్యత్తులో మరింత మందికి అవకాశాలను విస్తరించనున్నట్లు చెప్పారు.

అంతర్జాతీయీకరణకు ప్రాధాన్యం

విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే చర్యల్లో భాగంగా 30 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను జర్మనీకి పంపించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వీసీ తెలిపారు. అలాగే 40 మంది పరిశోధకులు, అధ్యాపకులను అంతర్జాతీయ విద్యా, పరిశోధనా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు.

పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం

విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 68కు పైగా పరిశోధనా ప్రాజెక్టులు, 1,000కు పైగా అంతర్జాతీయ పరిశోధనా ప్రచురణలు, 100కు పైగా పేటెంట్లు ఉన్నాయని తెలిపారు. పరిశోధనలకు మరింత ఊతమిచ్చేందుకు వివిధ ప్రభుత్వ, పరిశ్రమల సంస్థల సహకారంతో సుమారు రూ.50 కోట్ల పరిశోధనా నిధులను సమీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

పరిశ్రమలతో అనుసంధానం

పరిశ్రమలు–విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రొ. ప్రతాప్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రముఖ పరిశ్రమలు, స్టార్టప్ సంస్థలు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానం పెంచుతున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా CYIENT, T-Hub వంటి ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవడం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ భాగస్వామ్యాల ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు.

పరిశ్రమల సహకారంతో విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసే పరిశోధన ఫలితాలను వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలుగా మలచడంతో పాటు, వాటిని సమాజానికి చేరువ చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు.
గ్రామీణ విద్యార్థులకు ప్రపంచస్థాయి అవకాశాలు

గ్రామీణ, ద్వితీయ శ్రేణి ప్రాంతాల విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన, సాంకేతిక అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రొ. ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఏఐ, ఆధునిక సాంకేతికత, పరిశోధన, పరిశ్రమల అనుసంధానం, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

కాకతీయ విశ్వవిద్యాలయం తరఫున ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ప్రొ. బి. వెంకట్రామ్ రెడ్డి, యూజీసీ యూనిట్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ప్రొ. ఆర్. మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, అధ్యాపకులు, పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.