హనుమకొండ(రైట్స్ మీడియా): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమగ్ర సమాచారంతో దిశా సమావేశానికి హాజరుకావాల్సిన అధికారులు పూర్తి వివరాలు లేకుండా రావడంపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా కమిటీ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, వచ్చే సమావేశానికి తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో రావాలని స్పష్టం చేశారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, విద్య, మహిళా శిశు సంక్షేమం, రహదారులు, పురావస్తు తదితర శాఖల పరిధిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని ఎంపీ సమీక్షించారు. పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.