Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

గాంధీ కంటే గాడ్సే గొప్పవాడు అనడం బాధాకరం: ఎమ్మెల్యే నాయిని

దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

గాంధీ కంటే గాడ్సే గొప్పవాడు అనడం బాధాకరం: ఎమ్మెల్యే నాయిని
Share Short Clip Download PDF

హనుమకొండ ( రైట్స్ మీడియా): మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్య శారదలతో కలిసి ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..

మహాత్మా గాంధీ దేశానికి సత్యం, అహింస, శాంతి, ఐక్యత మార్గాలను చూపించిన మహనీయుడని అన్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించగలమనే నమ్మకాన్ని గాంధీజీ దేశ ప్రజల్లో కల్పించారని పేర్కొన్నారు.

దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ చేసిన పోరాటం, ఆయన చేసిన సేవలు, త్యాగాలు భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. గాంధీజీ చూపించిన మార్గం వల్లనే ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్య్ర ఉద్యమాన్ని విజయవంతం చేయగలిగామని తెలిపారు.

అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీ గాంధీజీని తక్కువ చేసి చూపించే విధంగా ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే నాయిని అన్నారు. గాంధీజీ విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ మరోవైపు సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికలలో గాంధీ కంటే గాడ్సే గొప్పవారిగా చూపించే ప్రయత్నాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. దేశం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు, సేవలను ఎవరెన్ని విధాలుగా ప్రచారం చేసినా చరిత్ర నుంచి చెరిపివేయడం సాధ్యం కాదన్నారు.

గాంధీజీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. దేశం కోసం సేవ చేసిన ఆ కుటుంబం వ్యక్తిగత ఆస్తులు, సంపద కోసం ఎన్నడూ పోరాటం చేయలేదని, దేశ ప్రయోజనాలకే తమ జీవితాలను అంకితం చేశారని పేర్కొన్నారు. అలాంటి మహనీయుల కుటుంబాలను ఆదర్శంగా తీసుకుని, సమాజానికి ఉపయోగపడే విధంగా మనమంతా పనిచేయాలని పిలుపునిచ్చారు.

దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గాంధీజీ ఆశయాలైన సత్యం, అహింస, సామాజిక సమానత్వం, దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..

అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. నిరాడంబరత, దేశభక్తి, కర్తవ్యనిబద్ధతకు లాల్ బహదూర్ శాస్త్రి ప్రతీకగా నిలిచారని అన్నారు. గాంధీజీ, శాస్త్రిజీ వంటి మహనీయుల జీవితాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, PACS చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గాంధీ కంటే గాడ్సే గొప్పవాడు అనడం బాధాకరం: ఎమ్మెల్యే నాయిని