హైదరాబాద్ (రైట్స్ మీడియా):
వయోవృద్ధులు కేవలం విశ్రాంతి పొందేవారు కాదని, వారు ఈ నవ సమాజానికి నిజమైన నిర్మితులని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వారి అనుభవం, ఆలోచనలు సమాజ ప్రగతికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి విజేంద్ర బోయి ఐఏఎస్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వయోవృద్ధుల సంక్షేమానికి విశేష కృషి చేసిన పలు స్వచ్ఛంద సంస్థలకు, వ్యక్తులకు ఈ సందర్భంగా మంత్రులు అవార్డులను ప్రధానం చేసి అభినందించారు.
వయోవృద్ధులు నవ సమాజ నిర్మితులు: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
సమాజంలో వయోవృద్ధులను మార్గదర్శకులుగా, బ్రాండ్ అంబాసిడర్లుగా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. "తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొందరు పిల్లలు వయోవృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు రావడం విచారకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు. వయోవృద్ధుల రక్షణ, సంక్షేమానికి ప్రజాపాలన ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, అవసరమైతే చట్టాల్లోని నిబంధనలను సవరించి అయినా వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమానికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.
వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ బస్ పాస్‌లు మంజూరు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన సీసీఎస్, పీఎఫ్ తదితర బకాయిలను క్రమంగా చెల్లిస్తున్నామని వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి రూ.1,000 కోట్లకు పైగా ఉన్న బకాయిల పరిష్కారంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించామని, త్వరలోనే చెల్లింపులకు సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
వయోవృద్ధులు తమ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని, వాటిని పరిష్కరించే బాధ్యత తమదని స్పష్టం చేశారు.