నరసరావుపేట(రైట్స్ మీడియా): గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాకుండా అన్ని సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఎలమంద గ్రామానికి రూ.1.70 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి, తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తొలి విడతలో పైప్‌లైన్ పనులు పూర్తి చేసి, ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్లు అందించినట్లు వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. జలజీవన్ మిషన్‌తో పాటు గోదావరి, రాయలసీమ, నల్లగొండ ప్రాంతాలకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎలమంద గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యర్ర మాసు ఆంజనేయులు, విశ్వేశ్వరయ్య, కడియాల రమేష్, యర్ర మాసు ప్రసాద్, తదితర గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.