నరసరావుపేట, అక్టోబర్ 10(రైట్స్ మీడియా): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి తెలుగుదేశం పార్టీ తరఫున తప్పనిసరిగా 34 శాతం సీట్లను కేటాయించడానికి తమ పార్టీ సంపూర్ణ నిబద్ధతతో ఉందని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు స్పష్టం చేశారు.

స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో ప్రజాసంక్షేమ పాలనను విజయవంతంగా అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గౌరవాన్ని కల్పించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు.

1987లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వగా, 1995లో చంద్రబాబు వాటిని 34 శాతానికి పెంచి వారి రాజకీయ ఉన్నతికి బాటలు వేశారని వివరించారు. గతంలో వైఎస్సార్‌సీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే కారణంతో బీసీలకు 34 శాతం దక్కకుండా కుట్రలు పన్నారని ఆయన మండిపడ్డారు. అయినప్పటికీ, చట్టపరమైన సంకెళ్లకు అతీతంగా రాబోయే మున్సిపాలిటీలు, పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు 34 శాతం టికెట్లను తప్పనిసరిగా కేటాయిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మరోసారి స్పష్టం చేశారని వెల్లడించారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల్లో మహిళలకు సైతం 33 శాతం సీట్లను కేటాయించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో బీసీలను తీవ్రంగా అణచివేశారని, వేలాది మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించి, రౌడీషీట్లు తెరిచి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీలకు కొండంత అండగా నిలుస్తోందని, వారి భద్రత కోసం ప్రత్యేకంగా 'బీసీ రక్షణ చట్టం' సైతం తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలను ప్రతి గడపకూ చేరవేసేందుకు పార్టీ శ్రేణులు విస్తృత కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. సీఎం ప్రసంగ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, అన్ని జోన్లలో బీసీ నేతల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమన్వయ భేటీలు నిర్వహించాలని సూచించారు. నరసరావుపేట పట్టణంలో ఆదివారం ఉదయం 10 గంటలకు స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ ఘనంగా జరగనుందని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రులు, ప్రముఖ కూటమి నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. అనంతరం అన్న క్యాంటీన్ సమీపంలో సామాజిక న్యాయ పోరాటయోధుడు బి.పి. మండల్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు, బీసీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని డాక్టర్ చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు.