సమాచార హక్కు చట్టం (RTI) అమలులో ఉల్లంఘనలు, కళాశాల ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యంపై 'రైట్స్ మీడియా' ప్రచురించిన కథనానికి, చేసిన న్యాయపోరాటానికి విశేష స్పందన లభించింది. రైట్స్ మీడియా ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (DIEO) తక్షణమే జోక్యం చేసుకుని, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని SVVRNR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన RTI బోర్డును ఏర్పాటు చేయించారు.
రైట్స్ మీడియా పోరాటానికి దక్కిన విజయం: స్పందించిన DIEO.. వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన RTI బోర్డు ఏర్పాటు
సమాచార హక్కు చట్టాన్ని (RTI Act) నిర్వీర్యం చేస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపాల్ తీరుపై 'రైట్స్ మీడియా' చేసిన పోరాటం సత్ఫలితాలను ఇచ్చింది. చట్ట నిబంధనలను పాటించని ప్రిన్సిపాల్ వైఖరిని ఎండగడుతూ, "సమాచార హక్కు చట్టానికి తూట్లు: కళాశాల ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యంపై 'రైట్స్ మీడియా' చట్టబద్ధమైన పోరాటం" అనే కథనాన్ని , వరంగల్ జిల్లా ప్రతినిధి మ్యాకల మహేష్, వర్ధన్నపేట ఆర్సి ఇంచార్జ్ బుర్ర వెంకటరమణ, నర్సంపేట ఆర్సి ఇంచార్జ్ వల్లె రమేష్ బృందం క్షేత్రస్థాయి సమాచారం తో రైట్స్ మీడియా వెబ్సైట్ లో ప్రచురించడమే కాకుండా ఉన్నతాధికారులకు ప్రాతినిధ్యం (Representation) అందజేసింది.
DIEO తక్షణ స్పందన
ఈ కథనం ఫిర్యాదుపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (DIEO) తక్షణమే సానుకూలంగా స్పందించారు. చట్ట నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన, పౌరులకు సమాచార హక్కు చట్టం కింద వివరాలు అందించడంలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేస్తూ తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఆదేశించారు.
DIEO ఆదేశాలతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని SVVRNR ప్రభుత్వ జూనియర్ కళాశాల (కాలేజ్ కోడ్: 39007) లో నూతనంగా 'సమాచార హక్కు చట్టం-2005' బోర్డును ఏర్పాటు చేశారు.
'సత్యానికి శక్తినివ్వడం - హక్కులను పరిరక్షించడం' రైట్స్ మీడియా ప్రధాన ధ్యేయం:
ఈ పరిణామం పౌరుల సమాచార హక్కును కాపాడటంలో 'రైట్స్ మీడియా' చిత్తశుద్ధికి నిదర్శనం. చట్టాలను ఉల్లంఘిస్తూ, బాధ్యత మరిచిన అధికారులు ఎవరైనా సరే.. వారిని నిలదీసి ప్రజల పక్షాన న్యాయం జరిగే వరకు రైట్స్ మీడియా పోరాటం ఆగదని ఈ విజయం మరోసారి రుజువు చేసింది. ఈ సందర్భాంగా వరంగల్ DIEO శ్రీధర్ సుమన్ కు రైట్స్ మీడియా సొసైటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.