Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
ప్రాతినిధ్యం

అసౌకర్యాల నడుమ వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి?..

సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్న యంత్రాంగం!

అసౌకర్యాల నడుమ వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి?..
Share Short Clip Download PDF

స్వయంగా జిల్లా కలెక్టర్ పెట్టించిన ఫిర్యాదుల బాక్స్ కు తాళం లేకపోవడం గమనార్హం!.

వర్ధన్నపేట(రైట్స్ మీడియా): పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రోగుల పాలిట నరకప్రాయంగా మారింది. నిత్యం 300 నుంచి 400 మంది ఓపీ రోగులతో రద్దీగా ఉండే ఈ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అధ్వాన్నంగా పారిశుద్ధ్యం.. కుక్కలు, పందుల సంచారం

ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వార్డులు, టాయిలెట్స్ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఆసుపత్రి ఆవరణమంతా చెత్తాచెదారం, వ్యర్థాలతో నిండిపోయి కుక్కలు, పందులకు ఆవాసంగా మారింది. రోగులు, వారి బంధువులు సేదతీరేందుకు కనీస వసతులు లేవు. ఓపీ వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉండగా, కూర్చోవడానికి బెంచీలు కూడా అందుబాటులో లేవు.

వార్డుల్లో ఫ్యాన్లు కరువు.. స్టాండ్స్ లేక అవస్థలు

వార్డుల్లో ఫ్యాన్లు లేక రోగులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రోగులకు ఎక్కించే గ్లూకోజ్ బాటిళ్లను తగిలించడానికి స్టాండ్స్ లేకపోవడంతో, వాటిని గోడలకు వేలాడదీయడం లేదా రోగుల బంధువులే స్వయంగా గంటల తరబడి పట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.

అందుబాటులో లేని టాయిలెట్స్ .. మౌన ప్రేక్షకులుగా అధికారులు

నిర్వహణ లేమి కారణంగా ఆసుపత్రిలోని బాత్రూమ్‌లకు అధికారులు తాళాలు వేశారు. నీటి వసతి లేకపోవడం నిత్యకృత్యంగా మారింది. చిన్నచిన్న వైద్య పరీక్షలు (ల్యాబ్, ఎక్స్-రే, స్కానింగ్) కోసం కూడా వైద్యులు రోగులను వరంగల్‌కు సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయించిన 'ఫిర్యాదుల బాక్స్'కు కనీసం తాళం కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.

సూపరింటెండెంట్ స్పందన:

ఈ సమస్యలపైన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. విరీన్ స్పందిస్తూ.. శానిటేషన్ సిబ్బందికి కాంట్రాక్టర్ ద్వారా సరైన జీతాలు రాకపోవడం వలనే వారు విధులకు హాజరుకావడం లేదని, దీని వల్లే ఆసుపత్రి ఆవరణ, వార్డులు అపరిశుభ్రంగా ఉన్నాయని అంగీకరించారు. నిధుల కొరత కారణంగానే పాడైన బాత్రూమ్‌లు, పైప్‌లైన్లకు మరమ్మతులు చేయించలేకపోతున్నామని, పైప్ లైన్లు బ్లాక్ అవ్వడం వల్లే టాయిలెట్స్ కు తాళాలు వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఫిర్యాదుల బాక్స్‌కు తాళం లేని విషయాన్ని తాను గమనించలేదని ఆయన పేర్కొన్నారు.

ప్రజల డిమాండ్:

ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి సద్వినియోగం కావడం లేదు. సౌకర్యాలు లేక పేదలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా వైద్యాధికారి (DMHO), మరియు జిల్లా కలెక్టర్ స్వయంగా ఆసుపత్రిని సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని, రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అసౌకర్యాల నడుమ వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి?..