ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు మెరుగ్గా ఉండే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రామకృష్ణాపూర్ , కంఠాత్మకూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు, తాగునీటి సరఫరాను స్వయంగా పరిశీలించారు.
రామకృష్ణాపూర్ లోని మండల ప్రాథమిక పాఠశాల లలో గల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్రం నిర్వహణ, పిల్లలకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న వి ఓ భవన పురోగతి ని కుడా చూశారు. అనంతరం కంఠాత్మకూర్ లోని మండల ప్రాథమిక పాఠశాలలోని భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
కేంద్రంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, విద్యా ప్రగతిని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ప్రత్యేక బోధన, కేంద్రంలో ఉన్న మౌలిక సదుపాయాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం వంటలు చేసారా లేదా అని వంటశాల కి వెళ్లి పరిశీలించారు. గుడ్లు, ఇతర వంట సామాగ్రి సరిపడా నిల్వలు ఉన్నాయా అని అడిగారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ, 8వ, 10వ తరగతి గదులను జిల్లా కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఆంగ్ల, తెలుగు భాషలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల వివరాలను పరిశీలించి, విద్యార్థులు పాఠశాలకు ఎందుకు హాజరు కావడం లేదనే కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.