Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
ప్రాతినిధ్యం

వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల అప్‌గ్రేడ్ ఎప్పుడు..?

ప్రకటనలకే పరిమితమా..? | పనులు ప్రారంభించాలని ప్రజల డిమాండ్.

వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల అప్‌గ్రేడ్ ఎప్పుడు..?
Share Short Clip Download PDF

వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తామన్న ప్రకటన కాగితాలకే పరిమితమైందా..? అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ 300 నుండి 400 మంది వరకు ఓపీ వస్తుంది. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, మండలాల ప్రజలు ఈ ఆసుపత్రిపైనే ఆధారపడుతున్నారు. సరిపడా బెడ్లు లేక, స్పెషలిస్ట్ డాక్టర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దీనిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చింది. స్థల పరిశీలన కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా పడలేదు.

ప్రజల ఆవేదన :

చిన్న ప్రమాదం జరిగినా వరంగల్ ఎంజీఎంకు, గర్భిణీలకు ఎమర్జెన్సీ సిజేరియన్ అవసరమైనా వెంటనే వరంగల్ సీకేఎం హాస్పిటల్ కు రెఫర్ చేస్తున్నారు. 30 పడకల ఆసుపత్రిలో అరకొర స్టాఫ్ తోనే నెట్టుకొస్తున్నారు. రాత్రి వేళ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. ఆస్పత్రి 100 పడకలకు అప్‌గ్రేడ్ అయితే స్పెషలిస్ట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి పేదలకు ఎంతో మేలు జరుగుతుంది అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వర్ధన్నపేట ఆసుపత్రి 100 పడకల అప్‌గ్రేడ్ పనులకు నిధులు మంజూరు చేసి, శంకుస్థాపన చేయాలని, అప్పటి వరకు ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.