నరసరావుపేట (రైట్స్ మీడియా): ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిటకే చేరాలనే సంకల్పంతో నరసరావుపేట నియోజకవర్గంలో సరిహద్దులు దాటిన మానవతా దృక్పథం ఆవిష్కృతమైంది. నరసరావుపేట మండలం చిన్నతురకపాలెం గ్రామానికి చెందిన సైదా వలి కుమారుడు ఎస్‌.కె.రిజ్వాన్ తీవ్రమైన తలసేమియా వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో రెండు వారాల క్రితం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయించుకుని, ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మొదటి నుంచీ ఆ బాబు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ వచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయనిధి (CMRF - LOC) ద్వారా ఇప్పటికే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు.

గత రెండు నెలలుగా చెన్నైలోనే చికిత్సలో ఉండటం వల్ల స్వగ్రామంలో అందాల్సిన తలసేమియా పింఛన్‌ను ఆ కుటుంబం తీసుకోలేకపోయింది. ఈ సమస్యను గ్రామస్తులు, స్థానిక నాయకులు స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకురాగా, వారు తక్షణమే స్పందించారు. వెంటనే సచివాలయ సోషల్ వెల్ఫేర్ సిబ్బంది తోకల గోపిని ప్రత్యేకంగా చెన్నైకి పంపించి, బాబు చికిత్స పొందుతున్న గది వద్దకే వెళ్లి పింఛన్ నగదును పంపిణీ చేయించారు. గాంధీ జయంతి సాధారణ సెలవు దినమైనప్పటికీ, ఎమ్మెల్యే ఆదేశాలను బాధ్యతగా స్వీకరించి చెన్నై వరకు ప్రయాణించి పింఛన్ అందించిన ఉద్యోగి తోకల గోపిని వీడియో కాల్ లో మాట్లాడతూ శాసనసభ్యులు వారు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా బాధితులకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన శాసనసభ్యుల చొరవను, ఉద్యోగి నిబద్ధతను స్థానిక ప్రజలు వేనోళ్ల కొనియాడుతున్నారు.