Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

పరిశ్రమల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండొద్దు: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

టీజీ ఐపాస్ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్

పరిశ్రమల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండొద్దు: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
Share Short Clip Download PDF

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతుల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు.

కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి టీజీ ఐ-పాస్ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత అధికారులతో కలిసి పరిశ్రమల స్థాపనకు సంబంధించిన దరఖాస్తులు, అనుమతుల మంజూరు, పారిశ్రామిక ప్రోత్సాహకాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను నిర్ణీత గడువు లోగా మంజూరు చేయాలని, అనుమతుల ప్రక్రియలో అనవసర జాప్యం జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గత సమావేశం నుంచి 28 కొత్త యూనిట్లు 64 రకాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిలో 32 అనుమతులను నిర్ణీత సమయంలో మంజూరు చేసినట్లు తెలిపారు.

అనుమతుల మంజూరులో సాంకేతిక సమస్యలు తలెత్తితే సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయం చేసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఏదైనా దరఖాస్తు అనుమతిలో జాప్యం జరిగితే అందుకు గల కారణాలను తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా నమోదు చేయాలని ఆదేశించారు.

అనుమతి మంజూరుకు అవసరమైన అదనపు సమాచారం, వివరణలు లేదా ప్రశ్నలను దరఖాస్తుదారులకు స్పష్టంగా లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. తిరస్కరించే దరఖాస్తుల విషయంలో కూడా తగిన, స్పష్టమైన కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు అందినట్లయితే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రూ. 2.58 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం

డీఐపీసీ సమావేశంలో మొత్తం 22 యూనిట్లకు వివిధ పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద రూ. 2,58,18,743 మంజూరుకు ఆమోదం లభించింది.

పెట్టుబడి సబ్సిడీ క్రింద ఎస్టీ కేటగిరీకి చెందిన 8 యూనిట్లకు రూ.1,83,27,581, ఎస్సీ కేటగిరీకి చెందిన 8 యూనిట్లకు రూ. 69,13,112, ఓసీ కేటగిరీకి చెందిన 2 యూనిట్లకు రూ. 2,72,232 ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపారు.

వడ్డీ క్రింద ఎస్టీ కేటగిరీకి చెందిన 2 యూనిట్లకు రూ.1,21,509, పవర్ కాస్ట్ క్రింద ఓసీ కేటగిరీకి చెందిన 2 యూనిట్లకు రూ.1,84,309 ప్రోత్సాహకాలకు ఆమోదం లభించింది.

పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను అర్హులైన పారిశ్రామికవేత్తలకు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమల అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తూ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జీఎం ఇండస్ట్రీస్ ప్రవీణ్ కుమార్, ఎల్‌డీఎం రవి ప్రసాద్, ఆర్టీఓ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముజాహిద్, ఇండస్ట్రీస్ ఏడి నకుల్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.