అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే ప్రథమ చికిత్స, సీపీఆర్ పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కే. మురళీమోహన్ సూచించారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అమర హాస్పిటల్స్ సౌజన్యంతో రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా ప్రథమ చికిత్స, సీపీఆర్ పై ప్రత్యేక అవగాహన మరియు ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిటిఓ మురళీమోహన్ మాట్లాడుతూ.. అమర హాస్పిటల్స్ బృందం సహకారంతో ప్రతీ వారం ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, నీటిలో మునిగిపోవడం, పాము కాటు వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు బాధితులను ప్రాణాపాయం నుండి ఎలా కాపాడుకోవాలనే మెలకువలను ఈ శిక్షణలో వివరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజారోగ్యం, భద్రత కోసం ఇటువంటి ప్రాణరక్షక శిక్షణను ఉచితంగా అందిస్తున్న అమర హాస్పిటల్స్ యాజమాన్యానికి, డాక్టర్ రమాదేవికి, డాక్టర్ ప్రసాద్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం అమర హాస్పిటల్స్ పరిపాలనాధికారి టి. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి తక్షణమే శ్వాస అందించి పునరుజ్జీవం పోసేందుకు సీపీఆర్ పద్ధతి అత్యంత కీలకమైనదని అన్నారు. వారంలో రెండు రోజులు రవాణా శాఖ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి, రోజుకు దాదాపు 100 మందికి సీపీఆర్, ప్రథమ చికిత్సలో ప్రత్యక్ష (హాండ్స్-ఆన్) శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మోటారు వాహన ఇన్స్పెక్టర్ వి.వి. సుబ్రహ్మణ్యం, సహాయ మోటార్ వాహన ఇన్స్పెక్టర్ బి. సువర్ణలత, పరిపాలనాధికారి జి. విజయ ప్రశాంతి, అమర హాస్పిటల్స్ వైద్య బృందం, సిబ్బంది మరియు రవాణా శాఖ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ప్రథమ చికిత్స, సీపీఆర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: డిటిఓ కే. మురళీమోహన్