భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ చర్యలు ముమ్మరం చేసింది. నిమజ్జన ఏర్పాట్లపై డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు డీఎస్పీ సూచించారు. ముఖ్యంగా నిమజ్జన మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, విద్యుత్ భద్రత తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచి భద్రతను పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.
అదేవిధంగా భక్తులకు తాగునీటి సౌకర్యం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో విగ్రహాలను సురక్షితంగా తరలించేందుకు అవసరమైన క్రేన్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
విద్యుత్ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు తనిఖీలు నిర్వహించాలని, నిమజ్జన మార్గాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, ఇతర అడ్డంకులను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రజలు, భక్తులు సహకరించాలని కోరారు.
భక్తి ఉత్సాహంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, నిమజ్జన సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ శాంతియుతంగా ఉత్సవాలను నిర్వహించాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రత.. శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ముమ్మరం
⏩ డీఎస్పీ రవీందర్ రెడ్డి.