నరసరావుపేట(రైట్స్ మీడియా): స్థానిక పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్‌ను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మర్యాదపూర్వకంగా కలిసి, సాదర స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని 3వ వార్డు నిమ్మతోట ప్రాంతంలో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, రాష్ట్ర మైనారిటీ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, గుంటూరు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర లతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు.
కూటమి పాలనలోనే పేదలకు అసలైన భరోసా..
• గత వైసీపీ ప్రభుత్వంలో అంతా మోసమే:రాష్ట్ర మైనారిటీ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్.
• 3వ వార్డు నిమ్మతోటలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ.
ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం పేరుతో ప్రజలను తీవ్రంగా వంచించారని మండిపడ్డారు. గత పాలకులు పింఛన్ల పెంపు విషయంలో ప్రజలను మోసం చేస్తూ అరకొర మొత్తాలతో కాలయాపన చేశారని, ఎందరో అర్హులైన పేదల పింఛన్లను సైతం అన్యాయంగా రద్దు చేశారని విమర్శించారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి, పింఛను మొత్తాన్ని భారీగా పెంచి ఒకటో తేదీనే నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెడుతోందని కొనియాడారు. పేదలు, మైనారిటీల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.