వైద్య వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, మానవ సేవకు అంకితమైన పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు. వైద్య విద్యలోకి అడుగుపెడుతున్న విద్యార్థుల జీవితంలో వైట్‌కోట్ ధరించడం ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. వైట్‌కోట్ కేవలం దుస్తువు మాత్రమే కాదని, వైద్య వృత్తిలోని పవిత్రత, నిబద్ధత, సేవాభావానికి ప్రతీక అని వివరించారు. నీట్లో అర్హత సాధించి వైద్య విద్యలో ప్రవేశించిన విద్యార్థుల వెనుక తల్లిదండ్రుల కృషి, త్యాగం ఎంతో ఉందని, వారి ఆశయాలను నెరవేర్చేలా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
వైద్య విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు మానవత్వం, రోగుల పట్ల ప్రేమ, సానుభూతి, సహనం అలవర్చుకోవాలని సూచించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ వైద్య వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి తెలిపారు. విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొంటూ సమగ్ర వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.
భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి వెల్లడించారు. కళాశాల భవనంతో పాటు బాలురు, బాలికల హాస్టళ్ల నిర్మాణానికి సుమారు రూ.130 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే బాలికల హాస్టల్‌ను ప్రారంభించామని, మరో15 రోజుల్లో బాలుర హాస్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వివరింవారు.
విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం సింగరేణి సంస్థ ద్వారా రెండు బస్సుల కొనుగోలుకు రూ.80 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, డీఎంఎఫ్టీ నిధుల సహకారంతో త్వరలోనే బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. కళాశాల ప్రధాన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు అవసరమైన వైద్యులు, అధ్యాపకుల నియామకాలు, ఇతర విద్యా సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
సెమినార్ హాళ్లకు ఏసీలు, వాటర్ ప్లాంట్, హాస్టళ్లలో లిఫ్ట్, జనరేటర్, కిచెన్ షెడ్ తదితర సౌకర్యాలను కల్పిస్తామని, మిగిలిన పనులను సీఎస్ఆర్ నిధుల సహకారంతో త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని భరోసా ఇచ్చారు.