పాలకుర్తి (రైట్స్ మీడియా): వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదుకు 2026 నవంబర్ 6 చివరి గడువు అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. అర్హులైన పట్టభద్రులందరూ నిర్ణీత గడువులోగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గతంలో పట్టభద్రుల ఓటరుగా నమోదైన వారు సైతం ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.

పాలకుర్తి నియోజకవర్గంలోని పట్టభద్రులందరూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని, తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి కోరారు.

పట్టభద్రుల ఓటు కేవలం ఒక ఎన్నికకే పరిమితం కాదని, విద్యావంతుల అభిప్రాయాలకు, యువత భవిష్యత్తుకు, నిరుద్యోగుల ఆశలకు, సమాజ అభివృద్ధికి ప్రతిబింబమని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు ఎంతో విలువ ఉందని, అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకుని, ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

విద్యావంతులైన పట్టభద్రులు చైతన్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. విద్య, ఉపాధి, యువతకు అవకాశాలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రాంత అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రులు చురుకుగా పాల్గొనాలని సూచించారు.

పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధితో పాటు విద్యావంతులు, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు ప్రాధాన్యత కల్పించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును బాధ్యతగా భావించి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

మీ ఓటు మీ హక్కు మాత్రమే కాదు.. మీ భవిష్యత్తును నిర్ణయించే శక్తి కూడా. ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలి” అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోరారు.