విజయవాడ(రైట్స్ మీడియా): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐఐటియన్ల మేధస్సు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో పాటు దేశాభివృద్ధి కోసం వారంతా అనుసంధానమై నెట్వర్క్ గా ఏర్పడాలని ఆయన సూచించారు. శనివారం విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్ 2026లో పాల్గొన్న ముఖ్యమంత్రి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ నాలెడ్జ్, డీప్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడ్డాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో పాటు, డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా రూ.500 కోట్ల పాన్ ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యు-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటం కంప్యూటర్లను ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్ రూపొందించిన ఈ కంప్యూటర్లు మినీ టెస్టింగ్ క్వాంటం కంప్యూటర్ ల్యాబ్‌లుగా ఉపయోగ పడనున్నాయి. 4 కెల్విన్ ప్రాసెసర్ సృష్టిని కూడా సీఎం ఆవిష్కరించారు. మేడిన్ అమరావతి బ్రాండ్ సృష్టించేలా క్వాంటం కంప్యూటర్ల తయారీకి శ్రీకారం చుట్టడం రాష్ట్రంలో డీప్‌టెక్ ఉత్పత్తుల తయారీ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. క్యు-శివ కంప్యూటర్ల తయారీలో కీలకంగా వ్యవహరించిన చండీగఢ్ యూనివర్సిటీ, క్యూబిట్ ఫోర్స్ ప్రతినిధులను సీఎం అభినందించారు. క్యు-శివ క్వాంటం కంప్యూటర్లను తయారు చేయడానికి అసరమైన కాంపోనెంట్లు మచిలీపట్నంలోనే లభ్యమవుతున్నాయని ఈ సందర్భంగా క్యూబిట్ సంస్థ సీఈఓ వివరించారు.