నరసరావుపేట(రైట్స్ మీడియా): పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి అన్ని విధాలా అండగా నిలిచి నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల ఆలోచనల మేరకు అమలు చేస్తున్న ‘పి4’ (P4 - Public Private People Partnership) విధానంలో భాగంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, దాతల సహకారంతో నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

ఇందులో భాగంగా ‘భారత్ ఫౌండేషన్’ (చైర్మన్ సజ్జా వెంకటేశ్వర్లు, ప్రతినిధుల) సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 150 మంది పేద విద్యార్థులకు ఉచితంగా నూతన సైకిళ్లను పంపిణీ చేశారు.వీటిలో కోటప్పకొండ వద్దనున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు 120 సైకిళ్లు అందజేయగా, నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మిగిలిన 30 సైకిళ్లను పేద విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు స్వయంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాలు, నిరుపేద వర్గాల పిల్లల చదువులకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటానని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద రైతులు, వ్యవసాయ కూలీల బిడ్డలు దూరప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, కొత్త సైకిళ్లు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న వారికి ఈ సాయం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా బడులకు వెళ్లి చదువులో రాణించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల కోసం తల్లికి వందనం, స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్స్, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సీఎస్సార్ నిధులు, దాతల తోడ్పాటుతో 20 కంప్యూటర్లతో కూడిన హైటెక్ ల్యాబ్‌ను త్వరలోనే జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో ఇప్పటికే ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతల సాయంతో 14 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి సురక్షిత తాగునీరు అందిస్తున్నామని గుర్తుచేశారు. విద్యార్థుల సంక్షేమం, ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న టీడీపీ,జనసేన, బీజేపీ నాయకులు,కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.