నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రాబోయే రబీ సీజన్‌లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వరి సాగుపై ఆధారపడకుండా శనగలు, కందులు, పెసలు, ఇతర పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన విత్తనాలను రాయితీపై అందుబాటులో ఉంచేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రైతులకు పంటల మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని, నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత ఆధారంగా పంటల ఎంపికపై వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు అందించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు పశుగ్రాసం, తాగునీటి కొరత ఏర్పడకుండా పశుసంవర్ధక శాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో పశుగ్రాసం నిల్వలు, సరఫరా ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలని, అవసరమైన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అదే సమయంలో గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థల్లో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా, మండలం, గ్రామపంచాయతీ స్థాయిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సీడీఎంఏ ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి తాగునీరు, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, పశుగ్రాసం, ప్రజారోగ్యం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించాలని సూచించారు. విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. భవనాల పైకప్పులపై కూల్ రూల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించడంతోపాటు విద్యుత్ వినియోగాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సేవలు నిరంతరాయంగా అందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని డా. టి.కె. శ్రీదేవి స్పష్టం చేశారు.
ఎల్ నినో ప్రభావం వల్ల జిల్లా లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి వివరించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లాలో రానున్న రోజుల్లో ఏర్పడే సాగు, త్రాగు నీటి ఎద్దడి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, వైద్య ఆరోగ్య,మొదలగు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు సూచించారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యత, భూగర్భ జలాల మట్టం, చెరువుల నీటి నిల్వలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నీటి కొరత ఏర్పడే అవకాశమున్న గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రాబోయే రబీ సీజన్‌లో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను రైతులు ఎంచుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
రాబోయే రబీ సీజన్‌లో వరి సాగును పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్ణయించి వాటి స్థానంలో శనగలు, కందులు, పెసలు, ఇతర పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. గ్రామాల వారీగా ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ, భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని సూచించారు. సాగునీటి వినియోగాన్ని అందుబాటులో ఉన్న నీటి నిల్వలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల లభ్యతను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపడతామని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితుల్లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో విద్యుత్, నీటి పొదుపుపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పశుసంపద కోసం పశుగ్రాసం లభ్యతను అంచనా వేసి అవసరమైన నిల్వలు, సరఫరా ఏర్పాట్లపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తాగునీటి వనరుల లభ్యత, సాగునీటి అవసరాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, విద్యుత్ సరఫరా, పశుగ్రాసం, ప్రజారోగ్యం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి గ్రామ, మండల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
వీసీ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ..... ఎల్ నీనో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులని సమర్థవంతంగా ఎదురుకునేందుకు క్షేత్ర స్థాయి లో తీసుకోవలిసిన తగు చర్యల పైన దిశా నిర్దేశం చేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, ఈ ఈ రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, జిల్లా సాగునీటిపారుదల శాఖ అధికారి రామ్మోహన్, విద్యుత్ శాఖ ఏడీఈ గంగారెడ్డి, భూగర్భ జల వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శైలశ్రీ మల్లికా దేవి, ఆర్డబ్ల్యూఎస్ డీజీ మధు, తదితరులు పాల్గొన్నారు.