Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల్లో అసలు ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

ఎస్ఐఆర్ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల్లో అసలు ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
Share Short Clip Download PDF

ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిశీలించాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్/హనుమకొండ(రైట్స్ మీడియా): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్‌ఐఆర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న విచారణలను పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలను సకాలంలో చేపట్టాలని తెలిపారు.

ఓటర్లకు జారీ చేయాల్సిన పెండింగ్ నోటీసులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను వారి ఇళ్ల వద్దే స్వీకరించాలని సూచించారు. ఓటర్ల అర్హతలను నిర్ధారించే సమయంలో సంబంధిత పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చూడాలని ఆదేశించారు.

ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు, అనర్హుల నమోదు, ద్వంద్వ నమోదులు లేకుండా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రతి బూత్ స్థాయి అధికారి తమ పరిధిలోని దరఖాస్తులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన రికార్డులను భౌతిక పత్రాల రూపంలో సక్రమంగా నిర్వహించి, భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచాలని సూచించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, దరఖాస్తుదారుల అసలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేసి అర్హతలను నిర్ధారించాలని సూచించారు. నకిలీ, తప్పుడు, ద్వంద్వ దరఖాస్తులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...

జిల్లాలో పట్టభద్రుల నఃండి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, అందిన మొత్తం 19 వేల దరఖాస్తుల్లో 45 దరఖాస్తులు పూర్తిగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. సుమారు 780 దరఖాస్తులు ఏఈఆర్వో స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మిగిలిన అన్ని దరఖాస్తులను బూత్‌ స్థాయి అధికారులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ, దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ తో పాటు ఏఈఆర్‌ఓ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, డీసీవో మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.