నిజామాబాద్(రైట్స్ మీడియా): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో ప్రజలను అధిక వడ్డీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ, అక్రమంగా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం నుండి పోలీసులు విస్తృతంగా మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది సంబంధిత వడ్డీ వ్యాపారుల ఇళ్లతో పాటు అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 67 ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించగా, 42 ప్రాంతాల్లో చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నగదు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన ఆధారాలపై పోలీసులు పరిశీలన చేపట్టి , నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.