హైదరాబాద్/హుస్నాబాద్ (రైట్స్ మీడియా): హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తో తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి అవసరమైన నిధుల వినియోగానికి దేవాదాయ శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి భారీగా నిధులు
⏩కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.3.80 కోట్లు
⏩పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్లు
⏩హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ.85 లక్షలు
కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.3.80 కోట్లు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.3,80,33,750ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ నిధులతో 5 అంతస్తుల రాజగోపురం, ప్రాకార మండపం/బౌండరీ వాల్, దక్షిణ మరియు పశ్చిమ వైపులా 3 అంతస్తుల రాజగోపురాలు, కార్యాలయ భవనం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
➤5 అంతస్తుల రాజగోపురం - రూ.65 లక్షలు
➤ప్రాకార మండపం/బౌండరీ వాల్ - రూ.1.06 కోట్లు
➤దక్షిణ వైపు 3 అంతస్తుల రాజగోపురం - రూ.35 లక్షలు
➤పశ్చిమ వైపు 3 అంతస్తుల రాజగోపురం - రూ.35 లక్షలు
➤కార్యాలయ భవనం - రూ.1.04 కోట్లు
➤శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం - రూ.17 లక్షలు
➤శ్రీ ఆంజనేయస్వామి ఆలయం - రూ.17 లక్షలు
అలాగే పనుల అమలుకు అవసరమైన నిధుల కోసం దేవస్థానం వద్ద ఉన్న 9 ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDRs) నుంచి గరిష్టంగా రూ.3,85,29,060 వరకు ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి ఆలయానికి రూ.1.50 కోట్లు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.1.50 కోట్ల నిధుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో 5 అంతస్తుల రాజగోపురం నిర్మాణంలో మిగిలిన పనులకు రూ.50 లక్షలు, ఆలయం చుట్టూ ప్రాకార మండపం నిర్మాణానికి రూ.1 కోటి ఖర్చు చేయనున్నారు.
ఆలయం వద్ద ఉన్న 5 FDRల నుంచి అవసరమైన మేరకు గరిష్టంగా రూ.1.50 కోట్లను ఉపసంహరించుకుని ఆమోదించిన అభివృద్ధి పనులకు వినియోగించేందుకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.85 లక్షలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధి పనులకు ఆలయం వద్ద ఉన్న FDRల నుంచి రూ.85 లక్షల వరకు నిధులు ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.
ఈ నిధులతో:
➤పట్నాల మండపం నిర్మాణం - రూ.40 లక్షలు
➤బోనాల మండపం నిర్మాణం - రూ.40 లక్షలు
➤ప్రసాదం తయారీ కాంప్లెక్స్ - రూ.5 లక్షలు
➤వెరసి మొత్తం రూ.85 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
నిబంధనల మేరకే నిధుల వినియోగం
ఆమోదించిన ప్లాన్లు, అంచనాలు, దేవాదాయ శాఖ నిబంధనలకు అనుగుణంగానే నిధులను వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనులకు వాస్తవంగా అవసరమైన మేరకు మాత్రమే FDRల నుంచి నిధులు ఉపసంహరించుకోవాలని, మిగిలిన మొత్తాన్ని FDRలలోనే కొనసాగించాలని ఆదేశించింది. నిధుల ఉపసంహరణ, FDRల వివరాలు, ఖర్చు చేసిన మొత్తం తదితర అంశాలతో పూర్తి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల భక్తులు, ఆలయ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన దేవాలయాలను మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.