జనగామ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రవేశాలు, విద్యా ప్రమాణాలు, కళాశాలల్లో అందిస్తున్న కోర్సులు, విద్యార్థుల హాజరు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలల్లో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థుల నమోదు సంఖ్య, విద్యార్థుల ప్రస్తుత సంఖ్య, డ్రాప్ అవుట్ విద్యార్థుల సంఖ్య, కళాశాలల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ కోర్సులు, వొకేషనల్ కోర్సులు, కళాశాలల్లో విద్యార్థుల విద్యా పురోగతికి అనుగుణంగా అకడమిక్ ఫ్రేమ్‌వర్క్ అమలు, కళాశాలల్లో వైఫై సదుపాయం, తదితర వివరాల గురించి క్షుణ్ణంగా చర్చించారు. ఈ క్రమంలో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 901 మంది విద్యార్థులు చేరారని డీఐఈఓ, కలెక్టర్ కు వివరించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 12 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు, అలాగే ప్రభుత్వ రంగానికి చెందిన 38 కళాశాలలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగంలోని 38 కళాశాలల్లో 12 కేజీబీవీలు, 9 ఎంజేపీలు, 8 మోడల్ కళాశాలలు, 5 సాంఘిక సంక్షేమ కళాశాలలు, 2 మైనారిటీ కళాశాలలు, 1 గిరిజన సంక్షేమ కళాశాల, 1 రెసిడెన్షియల్ కళాశాల ఉన్నాయని తెలిపారు.
విద్యార్థులు, అధ్యాపకుల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) ద్వారా తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో గణితంపై ఉత్సుకతను పెంపొందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గణితం కష్టమైన సబ్జెక్ట్ అనే భావన విద్యార్థుల్లో లేకుండా, సులభమైన పద్ధతులు, రోజువారీ జీవితానికి అన్వయించే ఉదాహరణలు, ఆసక్తికరమైన బోధనా విధానాలతో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలన్నారు. విద్యార్థులు ఉన్నత విద్య వైపు ముందుకు సాగేలా అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, తదితరులు పాల్గొన్నారు.