రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల రహదారుల రూపురేఖలు మార్చేందుకు ఉద్దేశించిన 'హ్యామ్' (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాలలో భాగంగా నిర్వహించిన 'జీరో అవర్'లో హ్యామ్ రోడ్ల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల పరిధిలోని వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి హ్యామ్ పథకాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచి, అన్ని రకాల ముందస్తు అనుమతులు మంజూరు చేసిందని అయితే, కాంట్రాక్టర్లతో ప్రభుత్వం ఇంకా అధికారిక అగ్రిమెంట్లు చేసుకోకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాలేదని సభ దృష్టికి తెచ్చారు. అక్టోబర్ నుంచి రోడ్డు నిర్మాణాలకు అత్యంత అనుకూలమైన వర్కింగ్ సీజన్ ప్రారంభమవుతున్నందున, దసరా పండుగ లోపే అగ్రిమెంట్ల ప్రక్రియను ముగించాలని కోరారు. పనులు మొదలయ్యాక కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తుగానే నిధులను సమకూర్చుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అడిగిన ప్రశ్నకు రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తక్షణమే స్పందిస్తూ వివరణ ఇచ్చారు. హ్యామ్ ప్రాజెక్టు కింద చాలావరకు అగ్రిమెంట్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. వచ్చే 15 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో రోడ్ల పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
​ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమకూర్పుపై ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నిరంతరం సమీక్షిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆర్బీఐ (RBI), హడ్కో (HUDCO) నుంచి రుణ అనుమతులు లభించాయని, నిధుల సమస్య లేదని చెప్పారు. ఈ వర్కింగ్ సీజన్‌లోనే ఆర్‌ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల పరిధిలోని రహదారుల పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సభకు వెల్లడించారు.