మంచిర్యాల(రైట్స్ మీడియా): సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 55 వేల కోట్ల బకాయిలను (అసలు, వడ్డీతో సహా) వెంటనే విడుదల చేయాలని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సిసిసి కార్నర్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన "సింగరేణి ధర్నా" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 40 రోజుల పాటు సమ్మె చేసి, పోరాడిన సింగరేణి కార్మికుల బ్రతుకులు తెచ్చుకున్న తెలంగాణలో ఆగం అవుతున్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇద్దరూ సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.