⏩నస్పూర్ సిసిసి కార్నర్ వద్ద బీజేపీ భారీ ధర్నా.
మంచిర్యాల(రైట్స్ మీడియా): సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 55 వేల కోట్ల బకాయిలను (అసలు, వడ్డీతో సహా) వెంటనే విడుదల చేయాలని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సిసిసి కార్నర్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన "సింగరేణి ధర్నా" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 40 రోజుల పాటు సమ్మె చేసి, పోరాడిన సింగరేణి కార్మికుల బ్రతుకులు తెచ్చుకున్న తెలంగాణలో ఆగం అవుతున్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇద్దరూ సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
➤55 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి: ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోవడంతో సింగరేణి సంస్థ 9% నుండి 12% వరకు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నడపాల్సిన పరిస్థితి దాపురించిందని, తక్షణమే ప్రభుత్వం అసలు, వడ్డీ చెల్లించి సంస్థను కాపాడాలని స్పష్టం చేశారు.
➤కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలి: కోల్ ఇండియా తరహాలోనే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రోజుకు రూ. 1250/- వేతనం చెల్లించాలి. దళారీ ఏజెన్సీలను రద్దు చేసి, నేరుగా సంస్థ ద్వారానే నియామకాలు జరపాలి.
➤వేధింపులు నిలిపివేయాలి: డిస్మిస్ ల పేరిట, నూతన 'PAA' విధానం పేరిట కార్మికులపై జరుగుతున్న వేధింపులను తక్షణమే ఆపాలి.
➤మౌలిక వసతులు, భద్రత కరువు: సింగరేణి ప్రాంతంలో రోడ్లు నిర్మించలేని స్థితిలో యాజమాన్యం ఉందని, అండర్ గ్రౌండ్ మైన్లలో పనిచేసే కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్, వారి కుటుంబాలకు మందులు కూడా కొనివ్వలేని దయనీయ స్థితి నెలకొందని ఆరోపించారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి, మెస్సీ ఫుట్ బాల్ ఆటకు సింగరేణి నిధులు ఖర్చు చేయడం దురదృష్టకరమన్నారు.
➤కమిషన్ల కోసం ప్రైవేటీకరణ: తెలంగాణ వచ్చిన సమయంలో 48 ఉన్న అండర్ గ్రౌండ్ మైన్లు ప్రస్తుతం 24 కి తగ్గాయి. ఓపెన్ కాస్ట్ లో బొగ్గు తీసే కాంట్రాక్టును ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి కమిషన్లు దండుకుంటున్నారని, నాణ్యమైన బొగ్గును పక్కదారి పట్టించడం వల్ల 30 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దొంగతనం జరిగిందని ఆరోపించారు.
➤కరెంటు కోతలు: రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అందడం లేదని, కేవలం 8 గంటల కరెంట్ మాత్రమే వస్తూ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని పేర్కొన్నారు.
అణచివేతలను ఎదుర్కొని, సమరశీల పోరాటాలు చేసిన తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుండా చైతన్యవంతంగా నిలబడాలని, బీజేపీ కార్మికులకు సంపూర్ణంగా అండగా ఉంటుందని ఎంపీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, సీనియర్ నాయకులు కందుల సంధ్యారాణి, చొప్పరి వేణు, శ్రీహరి రెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్, సునీల్ రెడ్డి, ముఖేష్ గౌడ్, హేమాజీ, కొంపల్లి శ్రీనివాస్, కార్మిక సంఘాల నాయకులు శ్రీధర్ రెడ్డి, కిరణ్ కుమార్, బాపు రాజు, వెంకటేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.