హైదరాబాద్(రైట్స్ మీడియా): రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని ప్రజల ముందు ప్రదర్శించడం వల్ల రాజ్యాంగంపై అవగాహన ఉన్నట్లు కాదని, దాని నిబంధనలను అర్థం చేసుకుని గౌరవించినప్పుడే రాజ్యాంగ పరిరక్షకులుగా గుర్తింపు లభిస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)ను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ కోరడం ఆయనకు రాజ్యాంగ ప్రక్రియపై ఉన్న అవగాహనను ప్రశ్నించేలా ఉందని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి నిర్దిష్టమైన విధానాలు ఉంటాయని, వాటిని పక్కనపెట్టి రాజకీయ డిమాండ్లు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి వర్తించే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ఆర్టికల్ 124(4) నిర్దేశిస్తుందని తెలిపారు. నిరూపిత దుర్వ్యవహారం లేదా అసమర్థత వంటి రాజ్యాంగబద్ధమైన కారణాలు ఉండాలి. పార్లమెంట్ ఉభయ సభల్లో నిర్దేశిత ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందిన అనంతరమే రాష్ట్రపతి తొలగింపు ఉత్తర్వులు జారీ చేయగలరని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి అయినా, ప్రతిపక్ష నేత అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా తమ వ్యక్తిగత లేదా రాజకీయ కోరికల మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించలేరని డా. బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడటానికే రాజ్యాంగం ఇటువంటి రక్షణలను కల్పించిందని వివరించారు.
రాహుల్ గాంధీకి ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై నిజంగా అభ్యంతరాలు ఉంటే, నిర్దిష్టమైన ఆరోపణలు, విశ్వసనీయమైన ఆధారాలతో సంబంధిత రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని సూచించారు. తీవ్రమైన ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు చూపించాలి తప్ప, రాజకీయ నాటకీయతకు ప్రాధాన్యత ఇవ్వకూడదని హితవు పలికారు.
పార్లమెంటులో ప్రతిపక్ష నేత పదవి అత్యంత కీలకమైనదని, ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు రాజ్యాంగ పరిజ్ఞానం, వాస్తవాలపై అవగాహన, నిర్మాణాత్మక చర్చ అవసరమని పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో ప్రదర్శించడం కంటే దాని విలువలను, నిబంధనలను గౌరవించడం ముఖ్యమని అన్నారు.
“రాజకీయ కామెడీని ఆపండి.. రాజ్యాంగంపై అవగాహన పెంచుకోండి.. దేశ భవిష్యత్తుపై అర్థవంతమైన చర్చకు రండి” అని రాహుల్ గాంధీకి డా. బూర నర్సయ్య గౌడ్ సూచించారు.
భారత్‌కు కావాల్సింది వాస్తవాలు, ఆధారాలు, నిర్మాణాత్మక విమర్శలతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యతాయుతమైన ప్రతిపక్షమని, రాజ్యాంగ సంస్థలను రోజువారీ రాజకీయ ఘర్షణలకు సాధనాలుగా మార్చే విధానం కాదని ఆయన పేర్కొన్నారు.