ఖమ్మం, అక్టోబర్ -27(రైట్స్ మీడియా): ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వానాకాలం పంటను అన్ని విధాలా కాపాడాలని, రాబోయే యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో ఎల్‌నినో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా నీటి పారుదల, మిషన్ భగీరథ, వ్యవసాయం, భూగర్భ జలాలు, మార్కెటింగ్, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులు తమ శాఖల ప్రస్తుత పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.