Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

త్రాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.. నీటిని పొదుపుగా వాడుకోవాలి: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

త్రాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.. నీటిని పొదుపుగా వాడుకోవాలి: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Share Short Clip Download PDF

ఖమ్మం, అక్టోబర్ - 19(రైట్స్ మీడియా): నీటిని పొదుపుగా, జాగ్రత్తగా వాడుకోవాలని, తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంత్రి సోమవారం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,

నాగార్జున సాగర్ జలాల ఆధారంగా, మంచుకొండ లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేసి ఈర్లపూడి చెరువును నింపడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే సమీప కాలంలో వర్షాలు పడే సూచనలు తక్కువగా ఉన్నందున నీటిని ఎంతో జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెరువులోని నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ వాడుకోవాలని సూచించారు. 

రైతులు నీటి అవసరం చాలా తక్కువతో సాగయ్యే ఆరుతడి పంటలు సాగు చేయాలని, వరి, మొక్కజొన్న లాంటి పంటలు సాగుచేయవద్దని సూచించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో పాటు, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, నీరు, కరంట్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని మంత్రి అన్నారు. ప్రజలకు, పశు పక్ష్యాదులకు త్రాగునీరు ఎంతో ముఖ్యమని, నీటిని, కరంట్ ను పొదుపుగా వాడుకోవాలని మంత్రి తెలిపారు.

ఈ పర్యటనలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అధికారులు, తదితరులు ఉన్నారు.