Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
క్రైమ్ న్యూస్

గుజరాత్‌లో రూ. 19.41 కోట్ల విదేశీ బంగారం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

గుజరాత్‌లో భారీ బంగారం స్మగ్లింగ్ దందా ఛేదించిన డిఆర్‌ఐ.. 13 కిలోల బంగారం స్వాధీనం..

గుజరాత్‌లో రూ. 19.41 కోట్ల విదేశీ బంగారం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
(బంగారు పేస్ట్)
Share Short Clip Download PDF

వడోదరలో అక్రమ కరిగించే కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు..

దుబాయ్‌కి చెందిన ఫైనాన్షియర్ మద్దతుతో అహ్మదాబాద్, సూరత్ విమానాశ్రయాల ద్వారా సాగుతున్న నెట్‌వర్క్..

గుజరాత్‌ (రైట్స్ మీడియా): అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా విదేశీ మూలాలున్న బంగారాన్ని భారత్‌లోకి అక్రమంగా రవాణా చేస్తున్న ఒక వ్యవస్థీకృత బంగారు స్మగ్లింగ్ సిండికేట్‌ను డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) భగ్నం చేసింది. దీనికి సంబంధించి కస్టమ్స్ చట్టం-1962 కింద ముగ్గురిని అరెస్టు చేశారు.

కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా డీఆర్ఐ అధికారులు అనుమానితులపై నిరంతరం నిఘా పెట్టారు. 2026 అక్టోబర్ 16 నాడు ప్రారంభమైన సమన్వయంతో కూడిన సోదాలు.. 42 గంటలకు పైగా కొనసాగాయి. ఈ ఆపరేషన్‌లో ఈ రాకెట్‌కు సంబంధించిన పూర్తి గొలుసు వెలుగులోకి వచ్చింది. విమాన ప్రయాణికుల ద్వారా స్మగ్లింగ్ చేయడం, హ్యాండ్లర్లకు అందజేయడం, అక్రమంగా కరిగించడం, ఒక జ్యువెల్లరీ దుకాణం ద్వారా విక్రయించడం వంటి విషయాలు బయటపడ్డాయి. సుమారు రూ. 19.41 కోట్ల విలువైన 13.017 కిలోల విదేశీ బంగారంతో కూడిన లావాదేవీలు బట్టబయలయ్యాయి. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు.

ప్రాథమిక విచారణలో భాగంగా ప్రయాణికులు అత్యంత చాకచక్యమైన, వినూత్నమైన దాచిపెట్టే పద్ధతులను ఉపయోగించి బంగారాన్ని దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. ఇందులో రోడియం పూత పూసిన సన్నని బంగారు తీగలు, ట్రాలీ బ్యాగుల లోపలి లైనింగ్‌లలో పొందుపరిచిన బంగారం, బ్యాగుల ఇన్నర్ షెల్స్‌లో దాచిన గోల్డ్ పేస్ట్ ఉన్నాయి. విమానాశ్రయాలకు చేరుకున్న తర్వాత ఈ బంగారాన్ని విమానాశ్రయాల వెలుపల ఉన్న హ్యాండ్లర్లకు అందజేసి.. మధ్యవర్తుల ద్వారా వడోదరలోని ఒక అక్రమ బంగారం కరిగించే కేంద్రానికి తరలించేవారు. ఆ విధంగా కరిగించిన బంగారాన్ని తదనంతరం నగదు రూపంలో విక్రయాల కోసం అహ్మదాబాద్‌లోని ఒక నగల దుకాణానికి సరఫరా చేసేవారు.

గుజరాత్‌లో రూ. 19.41 కోట్ల విదేశీ బంగారం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
(అక్రమంగా బంగారం కరిగించే కేంద్రం)

ఈ సమన్వయ ఆపరేషన్ ఫలితంగా సుమారు 890 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు అక్రమంగా కరిగించిన 6.41 కిలోల బంగారానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించాయి. సదరు నగల దుకాణంలో నిర్వహించిన తదుపరి సోదాల్లో సరైన పత్రాలు లేని విదేశీ మూలానికి చెందిన బంగారు బిస్కెట్లు, దుబాయ్‌లో ఉన్న ఈ సిండికేట్ ప్రధాన ఫైనాన్షియర్‌తో సంబంధం ఉన్న వేర్వేరు హ్యాండ్లర్ ద్వారా సరఫరా అయిన సుమారు 5.8 కిలోల స్మగ్లింగ్ బంగారానికి సంబంధించిన లావాదేవీల రికార్డులు లభ్యమయ్యాయి.

ఈ ఆపరేషన్ ద్వారా స్మగ్లింగ్ బంగారాన్ని చేరవేయటం, విక్రయించడంలో ప్రయాణికులు, హ్యాండ్లర్లు, మధ్యవర్తులు, బంగారాన్ని కరిగించే కేంద్ర నిర్వాహకులు, నగర వర్తక మార్గాల మధ్య ఉన్న పరస్పర సంబంధాలు బట్టబయలయ్యాయి. ఈ విచారణ సందర్భంగా హ్యాండ్లర్ లేదా ఫైనాన్షియర్, బంగారాన్ని కరిగించే కేంద్ర నిర్వాహకులు, ఇతర కీలక వ్యక్తులను గుర్తించారు. కస్టమ్స్ చట్టం- 1962 నిబంధనల ప్రకారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

రహస్యంగా దాచిపెట్టటం, విమానాశ్రయాల ద్వారా తరలించటం నుంచి కరిగించడం, ఫైనాన్సింగ్, దేశీయ మార్కెట్‌లో విక్రయాల వరకు ఉన్న ప్రతి గొలుసుకట్టు లింక్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యవస్థీకృత గోల్డ్-స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేసేందుకు డీఆర్ఐ చేస్తున్న కేంద్రీకృత ప్రయత్నాలను ఈ ఆపరేషన్ ప్రధానంగా తెలియజేస్తోంది.

గుజరాత్‌లో రూ. 19.41 కోట్ల విదేశీ బంగారం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
(రోడియం పూత పూసిన తీగలు)