గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సర్పంచులకు సూచించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వికసిద్భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (విబి జి రామ్ జి ), వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక ( విజిపిపి)పై జిల్లాలోని గ్రామ సర్పంచులు, గ్రామ మండల జిల్లా స్థాయి అధికారులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలి
⏩విబి జి రామ్ జి ద్వారా అభివృద్ధి పనులను చేపట్టాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
⏩హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో విబి జి రామ్ జి పథకం ద్వారా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక(విజిపిపి)పై జిల్లాలోని గ్రామ సర్పంచులు, గ్రామ మండల జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...
కొత్తగా గ్రామాల్లో ప్రారంభం కానున్న విబి జి రామ్ జి పథకానికి సంబంధించి ప్రతి గ్రామస్థాయిలో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయడమే ప్రధాన ఉద్దేశ్యంతో సర్పంచులు, అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ఈ సంవత్సరం చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేర్చాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
వీబి జీ రాం జీ పథకంలో భాగంగా సుమారు 375 పనులను చేపట్టే అవకాశం ఉందన్నారు. ఇందులో గ్రామాల్లో అవసరమైన సాగునీటి కాలువలు, ఓహెచ్ఎస్ఆర్, ఇంకుడు గుంతలు, సైడ్ డ్రైన్స్, వీవో భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ ఇతరత్రా నిర్మాణ పనులు, తాగునీటి పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తదితర అవసరమున్న పనులను గ్రామానికి ప్రయోజనం చేకూరే విధంగా ప్రణాళికను రూపొందించాలన్నారు.
గ్రామంలో ఇంకా మిగిలి ఉన్న సాగునీటి కాలువల పనులను కూడా ప్రణాళికలో చేర్చాలన్నారు. గ్రామాల్లో మురుగునీరు, వ్యర్ధ జలాలను సురక్షితంగా భూమిలో ఇంకింప చేయడానికి ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా డ్రెయిన్స్, సోక్‌పిట్లకు ఇప్పటికే అనేక చోట్ల అనుమతులు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఇందులో కొన్ని ప్రాంతాల్లో డ్రెయిన్స్, సోక్‌పిట్ల పనులు పూర్తయ్యాయని, అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు చేపట్టాల్సి ఉందన్నారు. అవసరమైన ప్రతి చోట డ్రెయిన్, సోక్‌పిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటింటికీ అవసరమైన చోట వ్యక్తిగత ఇంకుడు గుంతలు( సోక్ పిట్లు) నిర్మించాలన్నారు. గ్రామాలలో డ్రైనేజీ సమస్యలను గుర్తించి, వాటికి అనుగుణంగా సోక్‌పిట్లను ఏర్పాటు చేయాలన్నారు.
ఇప్పటికే మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో ఇంకా అవసరమైన పనులను గ్రామస్థాయి ప్రణాళికలో చేర్చి అన్ని అవసరాలు పూర్తయ్యే విధంగా ప్రాధాన్యత విధానంలో చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో ఏయే మౌలిక వసతుల పనులు అవసరమో పూర్తిగా గుర్తించి, ఈ సంవత్సరం చేపట్టాల్సిన పనులతో గ్రామస్థాయి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. గ్రామాలలో చేపట్టే అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో గ్రామసభ తీర్మానం చేసి పంపించాలన్నారు.
విబి జీ రామ్ జీ పథకం గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి దోహదపడుతుందన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి విబి జీ రామ్ జీ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచులకు సూచించారు.
సమావేశం అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో రూపొందించిన ఆత్మకూర్ గ్రామంలో ఇళ్లు, పాఠశాలలు, సాగునీటి కాలువలు, తదితర అంశాలతో వివిధ రంగులతో చిత్రపటాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
గ్రామానికి కావలసిన వివిధ అభివృద్ధి పనులను ఏ విధంగా గుర్తించి చేపట్టవచ్చు అనేది అద్భుతంగా చూపించారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్ శేషాద్రి, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, అడిషనల్ డిఆర్డివో లక్ష్మీ ప్రసన్న, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాధా కిషన్, పంచాయతీరాజ్ ఈఈ రాజగోపాల్ రావు, జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.