సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పేదల గుమ్మానికి చేర్చే బాధ్యతతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అదనంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలను నిర్మిస్తున్నామని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వచ్చే దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లు పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి సమానంగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని, జనగామ నియోజకవర్గానికి కూడా అదే విధంగా ఇళ్లు ఇచ్చామని తెలిపారు. లబ్ధిదారులు నిర్మాణ పనులు చేసిన దశలను బట్టి ప్రతి సోమవారం వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు.
రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇళ్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో పూరిగుడిసెలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుగా పూరిళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. జనగామ నియోజకవర్గంలో గుర్తించిన 500 పూరిళ్ల కుటుంబాలకు ఈ వేదికపై నుంచే రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లు, మొండిగోడలతో ఉన్న ఇళ్లు, స్లాబ్ స్థాయిలో ఆగిపోయిన ఇళ్లను కూల్చకుండా పూర్తి చేసుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా రెండో విడతలో అమలు చేస్తున్నామని చెప్పారు.
మూడో విడత, నాలుగో విడతల్లో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో సేకరించిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలను గుర్తించి, అర్హులైన పేదలకు పంపిణీ చేసి, తదుపరి విడతల్లో అక్కడ కూడా ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.70 వేల కోట్లకు పైగా సున్నా వడ్డీ రుణాలు అందించామని చెప్పారు.
గతంలో నిర్మాణం పూర్తికాని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నివాసయోగ్యంగా మార్చి, లబ్ధిదారులకు అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. జనగామలో ఇందుకు అవసరమైన రూ.2 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దసరా నాటికి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను నివాసయోగ్యంగా అందిస్తామని తెలిపారు. జనగామ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి మొదటి విడతగా రూ.25 కోట్లు వెంటనే మంజూరు చేస్తామని, ఇప్పటికే శంకుస్థాపన చేసిన రూ.58–60 కోట్ల అభివృద్ధి పనులు, టెండర్లు పూర్తయిన రూ.19 కోట్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తున్నామని, వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ అందిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 14–15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా ఇందిరమ్మ ఇల్లు విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇల్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు.