నరసరావుపేట(రైట్స్ మీడియా): యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు పూర్తి భరోసా అందించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ మరియు నారాయణ (SS&N) కాలేజీ, పాలడుగు నాగయ్య చౌదరి మరియు రఘురామయ్య (PNC&KR) కాలేజ్, MAM ఇంజనీరింగ్ కాలేజ్, కృష్ణవేణి డిగ్రీ కళాశాలల్లో శనివారం నిర్వహించిన సదస్సులకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ.. విద్యార్థులు, యువత సాధించాల్సిన లక్ష్యాలపై పలు కీలక సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
గతంలో కేవలం డిగ్రీ ఉంటే ఉద్యోగాలు వచ్చేవని, కానీ నేటి పోటీ ప్రపంచంలో అదనపు కోర్సులు నేర్చుకోవడం తప్పనిసరి అన్నారు. విద్యార్థులు క్లౌడ్, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలపై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయనే అపోహలు వద్దని, AI సహాయంతో సమాజంలోని సమస్యలకు నూతన పరిష్కారాలు కనుగొనే స్థాయికి యువత ఎదగాలని సూచించారు.
అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న లక్షలాది మంది యువతకు ఎంపీ పూర్తి భరోసానిచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో నియామకాలు అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా కేవలం అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే జరుగుతాయని హామీ ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వంలో యువత భవిష్యత్తుకు పూర్తి రక్షణ ఉంటుందని తెలిపారు.
దేశంలోకి వచ్చే మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం నిధులు మన రాష్ట్రానికే వస్తున్నాయని, ఇది రాబోయే రోజుల్లో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు తేనుందని ధీమా వ్యక్తం చేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడంతో పాటు సోషల్ మీడియాను కేవలం వ్యక్తిగత, సామాజిక వికాసానికి మరియు మంచి పనుల కోసమే వినియోగించాలని కోరారు. అలాగే సమాజంపై సరైన అవగాహన పెంపొందించుకుంటూ, విద్యార్థులు మహాత్మా గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో కళాశాలల యాజమాన్యం, ప్రిన్సిపాల్స్, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.