Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు

ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు
Share Short Clip Download PDF

ఖమ్మం(రైట్స్ మీడియా): ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. దేవి మానస జ్యోతి నివాస్ అంధుల మరియు బధిరుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల చట్టం–2016, న్యాయ సేవాధికార సంస్థల చట్టం గురించి వివరించారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండే సమాచార, కమ్యూనికేషన్ సదుపాయాలు, వివక్ష లేకుండా విద్య, ఉపాధి అవకాశాలు, సమాజంలో సమాన భాగస్వామ్యం కల్పించడం యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేశారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని చెప్పారు.

వివిధ రంగాల్లో దివ్యాంగులు సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది, ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, సంకేత భాషా అనువాదకులు పాల్గొన్నారు.

బ్యాంకు కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో బ్యాంకు కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించినట్లు కార్యదర్శి పి. దేవి మానస తెలిపారు.
ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 152 కేసులు రాజీ ద్వారా పరిష్కరించినట్లు ఆమె వెల్లడించారు.