అమరావతి(రైట్స్ మీడియా): భారతదేశం ఇప్పటివరకు చూడని మార్పు, అభివృద్ధి, సుపరిపాలనని తీసుకురావడానికి మేము తపన పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు మా టీం ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తోందని ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పాన్ ఐఐటి సమ్మిట్ – 2026లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... మేము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి... మోదీజీ ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి మా వంతు సహకారం అందించాలన్నదే మా ధ్యేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం 4.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఆయనకు ఇప్పుడు ఒక యంగ్ హార్డ్ వేర్ టీమ్ అండగా ఉంది.
50% శాసనసభ్యులు మొదటిసారి గెలిచినవారే, 25 మంది మంత్రులలో 17 మంది మొదటిసారి మంత్రులైనవారు. అనుభవజ్ఞమైన సాఫ్ట్‌వేర్‌కు యువ, డైనమిక్ హార్డ్‌వేర్ కలయికే నేటి ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా, విభిన్నంగా నిలబెడుతోంది. మా టీమ్‌కు ఒక స్పష్టమైన విజన్ ఉంది. ఏ రంగమైనా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా ఉండాలి. నా దృష్టిలో పాన్ ఐఐటీ అంటే కంపెనీలు, టెక్నాలజీలు, పరిశోధనా సంస్థలు మొత్తం పరిశ్రమలను నిర్మించిన వ్యక్తులు. పాన్ ఐఐటీ 23 ఐఐటీల పూర్వ విద్యార్థులందరినీ ఒకచోట చేర్చుతుంది. భారతదేశం అంతటా, ప్రపంచ ప్రధాన టెక్నాలజీ హబ్ లలో 5 లక్షలకు పైగా ఐఐటీ గ్రాడ్యుయేట్లను కలుపుతుంది. ఈ కమ్యూనిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో సమావేశం కావడం ఆనందంగా ఉంది.